వికారాబాద్, అక్టోబర్ 15 : పోడు భూముల వివరాలను ఎప్పటికప్పుడు మొబైల్ యాప్‌లో పొందుపర్చాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పోడు భూములు, నర్సరీల షిఫ్టింగ్, మన ఊరు మన బడి కార్యక్రమాలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యలను త్వరగా పూర్తి చేయాలంటే రోజూ ఉదయాన్నే ఏడు గంటలకు గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్జీలను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 5 మండలాల్లో పోడు భూముల ప్రక్రియ పూర్తయిందన్నారు. మిగతా మండలాల్లో కూడా రోజుకు 25 నుంచి 30 వరకు సర్వేలు నిర్వహించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. వచ్చే శనివారంలోగా స్థలాలను అప్పగించడంతోపాటు క్రీడా ప్రాంగణాల పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు సమన్వయంతో పని చేసి తెలంగాణ క్రీడా ప్రాంగణాలను పూర్తి హంగులతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలవారీగా క్రీడా ప్రాంగణాలకు కేటాయించిన అటవీ భూముల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. గ్రామకంఠంలో ఒకేచోట స్థల లభ్యత లేనైట్లెతే మూడు, నాలుగు ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలకు స్థలాలను గుర్తించి సామగ్రితో సహా వివిధ క్రీడలకు గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటు నిమిత్తం సంవత్సరానికి రూ.5లక్షల ఆదాయం లేని గ్రామపంచాయతీల వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
నర్సరీలో ఉన్న మొక్కలను ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామ పరిసరాల్లోని హెడ్ ట్యాంకుల వద్ద, పాఠశాల వద్దకు నర్సరీలను షిప్ట్ చేయాలన్నారు. చిన్నచిన్న స్థలాల్లో సుమారు 500 గజాల స్థలం ఉంటే అక్కడికి నర్సరీలను షిఫ్టింగ్ చేయాలని సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని కలెక్టర్ తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో పనులను గుర్తించి అన్ని పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో అశోక్‌కుమార్, ఆర్డీవో విజయకుమారి, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీపీవో మల్లారెడ్డి పాల్గొన్నారు.