రంగారెడ్డి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 16న జరుగనున్న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమీక్ష జరిగింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో సాఫీగా నిర్వహించేలా పక్కాగా ఏర్పాట్లు చేసుకోవాలని చైర్మన్ సూచించారు.
అనంతరం, ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో చేపడుతున్న ఏర్పాట్ల గురించి కలెక్టర్ అమయ్‌కుమార్ పలు వివరాలను వెల్లడించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగే పరీక్షకు జిల్లాలో 51,718 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా 128 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.
ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఎవరికైనా సందేహాలు, సమస్యలుంటే వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా 040-23235642, 040-23235643 ఫోన్ నంబర్లను కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసినట్టు చైర్మన్‌కు వివరించారు. 25 మంది తహసీల్దార్లను లైజనింగ్ ఆఫీసర్లుగా, 128 మంది అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లుగా నియమించి, 12 మండలాల్లో 25 రూట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని కేంద్రాలను ఇప్పటికే పరిశీలించినట్టు పేర్కొన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ ఎలక్ట్రిసిటీ, ఫాన్స్, టాయిలెట్స్, తాగునీరు వంటి సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
వికారాబాద్ : 16న నిర్వహించతలపెట్టిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు అభ్యర్థులు ఉదయం పది గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఒక నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. కలెక్టర్ సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్ లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్పరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని గ్రూప్-1 పరీక్షలకు తొలిసారిగా బయోమెట్రీక్ ఉంటుందన్నారు.
ఉదయం పది గంటల తర్వాత పరీక్ష కేంద్రంలో అనుమతించబడదని 10:15 గంటలకు పరీక్ష కేంద్రం ద్వారాలను మూసివేయనున్నట్లు తెలిపారు. పది సంవత్సరాల తర్వాత గ్రూప్-1 పరీక్షలు నిర్వహించనుండడంతో అభ్యర్థులు పెద్దఎత్తున హాజరవుతారన్నారు. పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. జిల్లా హెడ్‌క్వార్టర్‌లో స్ట్రాంగ్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రంలోని గేట్ ఎంట్రెన్స్ చీఫ్ సూపరింటెండెంట్ రూమ్‌లో సీసీ కెమెరాల కవరెజ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్షా కేంద్రానికి పరీక్షా మెటీరియల్‌ను పోలీసు బందోబస్తుతో సకాలంలో చేర్చాలన్నారు. పరీక్ష పూర్తయ్యేవరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాలన్నారు.
నేటి నుంచే చీప్ సూపరింటెండెంట్, సంబంధిత లైజన్ ఆఫీసర్లు, ఆసిస్టెంట్ ఆఫీసర్లు సంబంధిత పరీక్షా కేంద్రాలను సందర్శించి సౌకర్యాల ఏర్పాట్లను పూర్తిచేయాలన్నారు. పరీక్షా సమయంలో విద్యుత్, జిరాక్స్ సెంటర్లను మూసివేసి 104 సెక్షన్ విధించాలన్నారు. ఆర్టీసీ బస్సులను సకాలంలో నడుపి ఇబ్బందులు రాకుండా చేయాలన్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 7995061192ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఆడిషనల్ ఎస్పీ రషీద్, డీఆర్వో అశోక్‌కుమార్ ఆర్డీవో విజయకుమారి, డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.