వికారాబాద్, అక్టోబర్ 12, (నమస్తే తెలంగాణ) : దళిత బంధు పథకం అమలుతో జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. మొన్నటి వరకు కూలీ పని చేసి జీవనోపాధి పొందినవారు.. దళిత బంధు పథకంలో భాగంగా రూ.10 లక్షల విలువ చేసే యూనిట్లు సొంతం కావడంతోపాటు దండిగా ఉపాధి పొందుతున్నారు. దళిత బంధు పథకంతో ఐదారు నెలల క్రితం వరకు కారు డ్రైవర్లుగా పనిచేసినవారు.. నేడు ఓనర్లయ్యారు. జిల్లాలో లబ్ధిదారులు మినీ డెయిరీ, పౌల్ట్రీపామ్లతోపాటు కార్లు, ట్రాక్టర్ యూనిట్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి ఇప్పటికే ఆయా రంగాల్లోని నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇప్పించారు. దళిత బంధు లబ్ధిదారులు వారు ఎంచుకున్న వ్యాపారాల్లో ఏ విధంగానైనా నష్టపోయినట్లయితే వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రక్షణ నిధి కింద ఇప్పటివరకు రూ.35.80 లక్షలను సంబంధిత అధికారులు జమ చేశారు.
మరోవైపు మొదటి విడుతలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లాకు రూ.35.80 కోట్ల నిధులను విడుదల చేయగా.. 358 యూనిట్లకు సంబంధించి జిల్లా యంత్రాంగం గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. జిల్లాలో మొదటి విడుతలో మంజూరైన యూనిట్లలో వికారాబాద్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు, తాండూరు నియోజకవర్గంలో 100, పరిగి నియోజకవర్గంలో 80, కొడంగల్ నియోజకవర్గంలో 60, చేవెళ్ల నియోజకవర్గంలో 18 యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మరోవైపు రెండో విడుతకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గానికి 500 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతుంది.
నాడు అడ్డామీది కూలీ.. నేడు కారు ఓనర్
దళిత బంధు పథకంతో వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం గ్రామానికి చెందిన దళిత యువకుడి దశ మారింది. గ్రామానికి చెందిన ముసలిగాళ్ల మోహన్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ముగ్గురు అన్నదమ్ములు. తండ్రి పేరుపై రెండెకరాల పొలం ఉంది. అంతకు మించి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. బతకడం కోసం పదో తరగతి పూర్తయిన తరువాత డ్రైవింగ్ నేర్చుకున్నాడు. డ్రైవింగ్ కోసం రోజూ ఎవరు పిలిస్తే వారి వెంట వెళ్లేవాడు. కొన్నాళ్లు స్కూల్ బస్సు నడుపుతూ జీవనం కొనసాగించాడు. చాలీచాలని జీతంతో బతుకు నెట్టుకొస్తున్న మోహన్‌కు దళిత బంధు పథకం ఆశా కిరణంలా మారింది.
దళిత బంధు పథకం కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసింది. డ్రైవింగ్ రావడంతో కారు తీసుకుని ఉపాధి పొందుతానని అధికారులకు తెలియజేయడంతో ఈ ఏడాది జూన్‌లో మంత్రి కేటీఆర్ కారును అందజేశారు. సీఎం కేసీఆర్ అమల్లోకి తీసుకువచ్చిన దళిత బంధు పథకంతో ఒకనాడు అడ్డా మీద కూలీగా ఉన్న మోహన్ నేడు కారుకు ఓనరయ్యిండు. అంతకు ముందు తాను నెలకు రూ.10 నుంచి రూ.15వేల వరకు సంపాదించేవాడినని.. నేడు సొంత కారు కావడంతో నెలకు అన్ని ఖర్చులు పోనూ రూ.25 నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నానని లబ్ధిదారుడు మోహన్ తెలిపారు. తనకు భార్య, ముగ్గురు పిల్లలని.. దళిత బంధు పథకం తన జీవితంలో వెలుగులు నింపిందని.. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు సబ్బండ వర్గాల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.