మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి గులాబీ దండులోకి తరలివస్తున్నారు. ఉప ఎన్నికలో కారు పార్టీ విజయం తథ్యమని బలంగా నమ్ముతున్న అన్ని వర్గాల ప్రజలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా చేరికలు కొనసాగాయి. చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన 50 కుటుంబాలు గులాబీ పార్టీలో చేరాయి. నాంపల్లి మండలం ముష్టిపల్లిలో అభివృద్ధికి ఆకర్షితులై ఎంపీ మాలోతు కవిత సమక్షంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు.
కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డి: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
రాజగోపాల్‌రెడ్డి స్వప్రయోజనం కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని, ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి రూ.18 వేల కోట్ల కోసం రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విమర్శించారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్‌రెడ్డి ఏనాడూ ప్రయత్నించలేదని ఆరోపించారు. మునుగోడులో ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇక్కడి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మర్రిగూడ మండలంలోని ఎర్రగండ్లపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి ఓటు వేస్తే కేంద్రంలోని బీజేపీ సర్కారు విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. మాల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దంటు జగదీశ్, సర్పంచ్ మాడెం శాంతమ్మ వెంకటయ్య, ఎంపీటీసీ దంటు జ్యోతి గ్రామ శాఖ అధ్యక్షుడు ముద్దం శ్రీను, నాయకులు సంతోష్‌యాదవ్, వెంకటయ్య యాదయ్య, మురళి, వెంకన్న యాదయ్య నరసింహచారి, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
కూసుకుంట్లతోనే అభివృద్ధి:వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 4, 15 వార్డుల్లో మంగళవారం ఆయన గడపగడపకూ వెళ్లి ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి ఎన్నో పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసం రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికలో కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. నాయకులు బత్తుల దాసు, మారగోని ప్రవీణ్, కొంపెల్లి రవి పాల్గొన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు ఎదురు లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన పాండు వివేకానందగౌడ్ తెలిపారు. తంగడపల్లి గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు మంగళవారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఐదవ వార్డులో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీలో రాజగోపాల్ రెడ్డి ఎందుకు చేరారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫ్లోరైడ్ నిర్మూలనకు చేసింది శూన్యమన్నారు. తన ఎనిమిదేళ్ల పాలనలో మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ రక్కసిని కూకటి వేళ్లతో పెకిలించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వాల హయంలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతతో దేశంలోనే రాష్ట్రం అభివృద్ధిలో నంబర్‌వన్ గా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముట్టుకులోజు దయాకరాచారి కోయిల శేఖర్‌గౌడ్, బొంగు స్వామిగౌడ్, నిమ్మల అచ్చయ్య, అస్లం ఖాన్ పాల్గొన్నారు.