విద్యాభివృద్ధికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పాఠశాలల అభివృద్ధి కోసం ‘మన ఊరు-మనబడి’ని పకడ్బందీగా అమలు చేస్తున్నది. ఇక జూనియర్ కాలేజీల్లో కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యా బోధన చేపడుతున్నది. ఉచితంగా పుస్తకాలు, నాణ్యమైన విద్య లభిస్తుండడంతో చాలామంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వికారాబాద్ జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా, ఈ ఏడాది కొత్తగా 2,832 మంది విద్యార్థులు చేరారు. ఇందులో అత్యధికంగా తాండూరు కాలేజీలో 1,185 మంది విద్యార్థులు చేరారు. నిరంతరం సీసీ కెమెరాల నిఘా, బయోమెట్రిక్ విధానం, డిజిటల్ తరగతులు, ల్యాబ్‌లు, ఎంసెట్, జేఈఈ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందుబాటులో ఉండడంతో ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు విశ్వాసం పెరిగింది. దీంతో తమ పిల్లలను స్వచ్ఛందంగా ప్రభుత్వ కాలేజీల్లో చేర్పిస్తుండడంతో ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది.
వికారాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మహర్దశ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తుండటంతో అందులో విద్యార్థులు చేరేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభు త్వం అధికారం చేపట్టిన అనంతరం ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. అంతేకాకుండా కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి.
అనుభవం కలిగిన అధ్యాపకులు, సొంత భవనాలు, డిజిటల్ విధానంలో మెరుగైన బోధన, ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేస్తుండటంతో విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా ప్రైవే ట్, కార్పొరేట్ కాలేజీల నిర్వాహకులు సరైన వసతులు, బోధన లేకున్నా.. విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండటంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూ నియర్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వికారాబాద్ జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ జూనియ ర్ కాలేజీలుండగా అందులో ఈ ఏడాది కొత్తగా మూడు వేల మంది వరకు విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
ప్రభుత్వ కాలేజీల్లో ఎంసెట్, జేఈఈ ప్రవేశ పరీక్ష తరగతులు…
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్హతతోపాటు అనుభవం కలిగిన అధ్యాపకులు ఉండటంతో వారు బోధనతోపాటు ఇంటర్ అనంతరం ఇంజినీరింగ్, మెడికల్‌కు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు కూడావిద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ఎంసెట్, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ గంటసేపు ఎంసెట్, జేఈఈ ప్రవేశ పరీక్షల కు అవసరమైన తరగతులను బోధిస్తున్నారు. దీం తో గతేడాది జరిగిన ఎంసెట్, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు సత్తా చాటారు.
ఉచితంగా అన్ని కోర్సులకు సంబంధించిన పుస్తకాలు, ప్రాక్టికల్స్‌కు సంబంధించి ల్యా బ్ మెటీరియల్‌ను అందించడం, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం అమలుతో రోజురోజుకూ విద్యార్థులు, అధ్యాపకుల హాజరు శాతం కూడా పెరుగుతున్నది. అంతేకాకుండా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు దీటుగా గత ఐదేండ్లుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఉదయం గంట, సాయంత్రం సమయం లో మరో గంటపాటు ప్రత్యేక తరగతులను బోధిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై లెక్చరర్లు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. విద్యార్థులను దత్తత తీసుకొని మరీ ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏ సబ్జెక్టులోనైనా ఉత్తీర్ణతాశాతం తగ్గితే సంబంధిత అధ్యాపకుడిపై చర్య లు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తుండటంతో ప్రతి లెక్చరర్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థుల ఉత్తీర్ణతాశాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు.
ఈ ఏడాది 2,832 మంది…
జిల్లాలోని తొమ్మిది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది కొత్తగా 2,832 మంది విద్యార్థులు చేరారు. అత్యధికంగా తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1,185 మంది విద్యార్థులు అడ్మి షన్లు పొందారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరిన విద్యార్థుల వివరాలు ఇలా.. నవాబుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 57 మంది విద్యార్థులు, వికారాబాద్‌లో 354 మంది, పెద్దేముల్లో 115 మంది, పరిగిలో 335మంది, మర్పల్లిలో 191మంది, మోమిన్‌పేటలో 138 మంది, దోమలో 183, కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 274 మంది విద్యార్థులు ఈ ఏడాది చేరారు.
ప్రైవేట్‌కు దీటుగా బోధన
ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నాణ్యమైన బోధన విద్యార్థులకు అందుతున్న ది. అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైన మౌలి క వసతులు అందుబాటు లో ఉన్నాయి. ఎంసెట్, జేఈఈ లాంటి ప్రవేశ పరీక్షలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులను అధ్యాపకులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ వారు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. దీంతో గతేడాది జరిగి న ఎంసెట్, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థు లు మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఉత్తమ బోధన అందుతుండటంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఏటేటా పెరుగుతున్నది.
– శంకర్‌నాయక్, ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి