ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 10: ఇటీవల కురిసిన వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని పలు చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయని.. వాటి నుంచి చుక్కా నీరు కూడా వృథా పోకుండా తూములకు మరమ్మతులు చేపడుతామని రాష్ట్ర ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బన్సీలాల్, ఎస్సీ ఐదర్ఖాన్ తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి ఇబ్రహీంపట్నం చిన్నచెరువు తూము నుంచి నీరు వృథాగా దిగువ ప్రాంతానికి వెళ్తుండటంతో మత్స్యకార సంఘం సభ్యుల ఫిర్యాదు మేర కు సోమవారం అధికారులు చిన్నచెరువు తూమును పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూముల లీకేజీతో పలు ప్రాంతాల్లో నీరు వృథాగా పోతుండటంతో సత్వరమే మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికడుతామన్నారు. ఇబ్రహీంపట్నం చిన్న, పెద్ద చెరువుల నుంచి నీటిని ఇప్పట్లో దిగువ ప్రాంతానికి వదులమన్నారు. ఎవరైనా తూములకు గండికొట్టినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. చిన్న చెరువు తూ ము గండి పూడ్చివేత పనులను త్వరగా చేపడుతామని.. ఇసుక బస్తాలతో తూము పూడ్చివేత పనులు జరుగుతున్నట్లు వారు తెలిపారు. అలాగే, పెద్ద చెరువు రెండు తూములు కూడా లీకవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాటికి కూడా వెంటనే మరమ్మతులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ ఉషారాణి, ఎస్సీ రాజ్యలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నుంచి ఇందిరాసాగర్‌కు..
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు అలుగు రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఈ అలుగు నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నీరు తట్టిఖానా చెక్‌డ్యాం నుంచి ఇందిరాసాగర్‌కు చేరుతున్నది. దీంతో ఇందిరాసాగర్ కూడా పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి ఏర్పడింది. పెద్దచెరువుకు ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నది.