కనువిందు చేస్తున్న బోడకొండ గుట్టల నుంచి జాలువారుతున్న
మంచాల అక్టోబర్ 10: మండలంలోని వివిధ గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లడమే కాకుండా చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. బోడకొండ గుట్టలపై నుంచి వస్తున్న వర్షపు నీటితో ఆ ప్రాంతం మొత్తం కొత్త అందాలను సంతరించుకున్నది. మండలంలోని ఎల్లమ్మమతండా నుంచి లోయపల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన వరి, ఇతర పంట పొలాలతో ఎటుచూసినా పచ్చని పొలాలు కనువిందు చేస్తున్నాయి. ఎల్లమ్మతండా, బోడకొండ, లోయపల్లి తదితర గ్రామాల్లో పచ్చని పైర్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. బోడకొండ, ఎల్లమ్మతండా, సత్యం తండాల గుట్టలపై నుంచి వస్తున్న వర్షపు నీటితో చెక్‌డ్యాంలు నిండి పరవళ్లు తొక్కుతున్నాయి. బుడుబుంగ చెక్ డ్యాం నిండి మత్తడి పోస్తున్నది. ఇబ్రహీంపట్నం నుంచి బోడకొండకు 22 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఇబ్రహీంపట్నం నుంచి ప్రతి 30 నిమిషాలకు ఆర్టీసీ బస్సులు గున్గల్, రంగాపూర్, ఎల్లమ్మతం డా, బోడకొండ, లోయపల్లి వరకు బస్సు సౌక ర్యం కలదు. కార్లు, బైక్‌లపై ప్రయాణించేవారు ఇబ్రహీంపట్నం నుంచి మంచాల, ఆరుట్ల, చెన్నారెడ్డిగూడ గ్రామాల మీదుగా బోడకొండ అందాలను వీక్షించేందుకు ఇక్కడికి చేరుకోవచ్చు.