కులకచర్ల, అక్టోబర్ 9 : అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం 102 సేవలను గర్భిణులకు అందజేస్తున్నది. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలలు పూర్తయ్యే వరకు నాలుగుసార్లు వైద్య పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. ఇందుకోసం చాలామంది గ్రామీణ ప్రాంతవాసులు నానా కష్టాలు పడి, ప్రభుత్వ దవాఖానలకు వెళ్తుంటారు. కొన్ని గ్రామాల్లో రవాణా సౌకర్యాం కూడా ఉండదు. ఆటోలు, జీపులు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చి గర్భిణులకు సేవలందిస్తున్నది.
ఆయా గ్రామాల్లో ఉండే ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఎంత మంది గర్భిణులు ఉన్నారు? అనే విషయాన్ని నమోదు చేసుకుంటారు. ప్రతి రోజూ ఎంత మంది పరీక్షలు చేయించుకుంటున్నారో తెలుసుకొని 102 వాహనాలకు ఫోన్ చేస్తారు. వెంటనే గ్రామాలకు 102 వాహనాలు వచ్చి స్థానిక ప్రభుత్వ దవాఖానలకు వారిని తీసుకెళ్తాయి. ఇలా నాలుగు సార్లు వైద్య పరీక్షల కోసం 102 వాహనాలను వినియోగించుకోవచ్చు. దీనికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరంలేదు.
ప్రభుత్వ దవాఖానలో కాన్పు అయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు కూడా 102 వాహనాలను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం స్వయంగా వారే 102కు ఫోన్‌చేసి పిలిపించుకోవచ్చు, సాధారణ కాన్పు అయినవారిని 48 గంటల తర్వాత, సిజేరియన్ అయినవారిని వారం తర్వాత ఇంటికి వెళ్లేందుకు 102 వాహన సేవలు వాడుకోవచ్చు.
ప్రభుత్వ దవాఖానల్లో సుఖ ప్రసవాలు పొందేందుకు, ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులోభాగంగా 102 వాహనాన్ని గర్భిణుల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 102 వాహనానికి ఫోన్ చేస్తే క్షణాల్లో సంబంధిత స్థలానికి చేరుకుంటుంది. ఈ వాహనాల్లోనే గర్భిణులకు ఆత్యవసర వైద్య సేవలు అందించేందుకు అన్ని వసతులు కల్పించింది. డిశ్చార్జి తర్వాత ఇంటికి వెళ్లేందుకు వాహనాన్ని వినియోగించుకోవచ్చు.
– డాక్టర్ మురళీకృష్ణ, వైద్యాధికారి, కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
గర్భిణిగా నిర్ధారణ అయిన తరువాత వారికి వైద్యం అందించేందుకు వారి గ్రామాల నుంచి కులకచర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. దీంతో పేదవారికి రవాణా ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ప్రసవం అయిన తర్వాత కూడా ఈ వాహనాన్ని ఉపయోగిస్తున్నాం.
– చంద్రప్రకాశ్, సీహెచ్‌వో, కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం