బొంరాస్పేట, అక్టోబర్ 9 : బొంరాస్పేట, దుద్యాల మండలాల్లోని గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. ఈ ఏడాది వానకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి. వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో రైతులు చెరువులు, కుంటలు, బోర్ల కింద వరినాట్లు వేశారు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో యాసంగిలో వరినాట్లు వేయడానికి రైతులు వెనుకంజ వేశారు.
అయినా రైతులు పండించిన వరి పంటను రాష్ట్రమే కొనుగోలు చేసింది. వానకాలంలో పండించిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొంటున్నది. దీంతో రైతులు వానకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగుకే మొగ్గు చూపారు. రెండు మండలాల్లో 13 నోటిఫైడ్ చెరువులు, వంద కుంటలు ఉండగా, వీటి కింద 7వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మిగతాది వ్యవసాయ బోర్ల కింద ఉంది. బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో 20, 961 ఎకరాల్లో రైతులు వానకాలంలో వరినాట్లు వేశారు. గత వానకాలంలో వేసిన దానికంటే 4వేల ఎకరాలు అధికం. జిల్లాలోనే అత్యధిక వరిసాగు విస్తీర్ణం చేసిన మండలంగా బొంరాస్పేట నిలిచింది. ఎక్కువ విస్తీర్ణంలో వరిసాగు చేయడంతో మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా పచ్చదనం కనిపిస్తున్నది.
నైరుతి రుతుపవనాల సమయం ముగిసినా ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జూలైలో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు నిండాయి. దీంతో చెరువులు, కుంటల్లోని నీరు పంటలకు వినియోగించుకోలేదు. వానలతోనే వరి పంటలు పండుతున్నాయి. వరి కోతలు పూర్తయినా చెరువుల్లోని నీరు అలాగే ఉంటుంది. దీంతో యాసంగిలో కూడా వరిసాగుకు ఢోకా ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.