ఆదిబట్ల, అక్టోబర్ 9 : అంగన్వాడీ కేంద్రాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతమున్న మినీ అంగన్వాడీ కేంద్రాలను జనాభాకనుగుణంగా ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి అధికారులు చర్యలు చేపట్టారు. పరిమితికి మించి జనాభా ఉన్న చోట కొత్తగా మినీ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రెవెన్యూ గ్రామాలకు ఆవాసాలు దూరంగా ఉండటంతోపాటు జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పదేండ్ల క్రితం ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహరం అందించాలనే ఉద్దేశంతో మినీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాటి పరిధిలో జనాభా, కుటుంబాలు పెరుగడంతో అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. దీంతో అధికారులు ప్రతిపాదనలు పంపించారు.
ప్రభుత్వం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 500 మంది జనాభా ఉన్న గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. నేడు అంగన్వాడీ కేంద్రాలను సైతం గిరిజన, ట్రైబల్ ప్రాంతాల్లో 300 మందికి పైగా జనాభాకు, మున్సిపాలిటీ, పట్టణ ప్రాంతాల్లో 400 మందికి పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
రంగారెడ్డి జిల్లా పరిధిలో 1600 అంగన్వాడీ కేంద్రాలుండగా.. అందులో 1,31,630 మంది చిన్నారులకు విద్యతో పాటు ప్రభుత్వం వారికి పౌష్టికాహరం అందిస్థున్నది. ఇందులో 1380 ప్రధాన కేంద్రాలు, 220 మినీ కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వం గతంలో చేపట్టిన కుటుంబ సర్వే ఆధారంగా 98 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మార్గదర్శకాల ప్రకారం జనాభా అధారంగా ఐసీడీఎస్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయిలో ఈ ప్రతిపాదనలపై ప్రత్యేక చొరవ చూపుతుందని.. అతి త్వరలోనే ప్రభుత్వం అమలు చేస్తుందని అదికారులు అంటున్నారు.
మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం టీచర్ ఒక్కరే పని చేస్తున్నారు. వీటిని అప్‌గ్రేడ్ చేస్తే ప్రభుత్వం హెల్పర్లను నియమించనుంది. ప్రధాన కేంద్రాల్లో పనిచేసే టీచర్‌కు నెలకు వేతనం రూ.13,650 ఉండగా.. మినీ కేంద్రాల్లోని టీచర్లకు రూ.7,800 మాత్రమే అందజేస్తున్నది. అప్‌గ్రేడ్ చేస్తే వీరి వేతనాలు కూడా పెరుగనున్నాయి.
1975లో ఐసీడీఎస్ వ్యవస్థ ఏర్పడింది. వెయ్యి మంది జనాభా ఉన్న చోట ఒక అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పౌష్టికాహారం, ఐదేండ్ల లోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నది. వెయ్యి జనాభాలోపు ఉన్న చోట మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనాభా పెరుగుదల, నివాస ప్రాంతాల విస్తరణ నేపథ్యంలో ఐసీడీఎస్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు మాతా, శిశు సంరక్షణశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త మినీ అంగన్వాడీ కేంద్రాలు, పాత మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌కు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించడంతో సర్కార్ వెంటనే అమలు చేయడానికి సన్నాహాలు చేపడుతున్నది.
ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం
మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రంలో 500 జనాభా కలిగిన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. మినీ అంగన్వాడీ కేంద్రాలు కూడా అప్‌గ్రేడ్ కానుండడంతో టీచర్ల జీతాలు పెరుగనున్నాయి.
– కోరే కళమ్మ, ఆదిబట్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం
మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అడిగారు. మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 98 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయడానికి సర్కారుకు ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వ ఆమోదం తర్వాత ఇవి ప్రధాన కేంద్రాలుగా మారుతాయి. దీంతో 98 కేంద్రాల్లో 98 మంది ఆయా పోస్టుల నియామకాలను చేపట్టనుంది.
– మోతీ, జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి