షాబాద్, అక్టోబర్ 9: భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా రూ. కోట్లు ఖర్చు చేసి పురాతన చెరువులను పూడిక తీసి అభివృద్ధి చేసింది. దీంతో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ నిండి అలుగు పారుతున్నాయి. మిషన్ కాకతీయ పథకంలో మొదటి విడుతలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోనే షాబాద్ పహిల్వాన్ చెరువును మినీట్యాంక్ బండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం రూ. 7 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చెరువులో పూడికతీత పనులు చేపట్టడంతో పాటు చెరువు కట్టను అభివృద్ధి చేశారు. చెరువుకట్టపై వాకింగ్ ట్రాక్స్, బతుకమ్మ ఘాట్, లవ్ షాబాద్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం జూలైలో కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండటంతో అలుగు పారుతున్నది. సుమారు రెండు నెలలు దాటినా కూడా ప్రస్తుతం చెరువు అలుగు పారుతూనే ఉంది.
షాబాద్ పహిల్వాన్ చెరువు నీటితో కళకళలాడుతుండటంతో పాటు అలుగు పారుతుండటంతో చెరువు కింద ఉన్న బోర్లల్లో నీటిమట్టం పెరిగింది. చెరువు కింద ఉన్న ఆయకట్టు భూమి 300 ఎకరాల్లో రైతులు వివిధ పంటల సాగు చేసుకుంటున్నారు. సుమారు 180 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కింద షాబాద్, కేశవగూడ, సంకెపల్లిగూడ, శేరిగూడ, పటేల్‌గూడ, ముద్దెంగూడ, మల్లారెడ్డిగూడ గ్రామాలకు చెందిన 200 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ చెరువు నిండితే షాబాద్ మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న చేవెళ్ల, మొయినాబాద్, శంషాబాద్, కొత్తూరు, నందిగామ మండలాల్లోని పలు గ్రామాల్లో రైతుల బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. నాలుగైదు సంవత్సరాల నుంచి భారీ వర్షాలతో చెరువులో నీరు పుష్కలంగా ఉండటంతో బోరుబావుల్లో నీరు పెరిగిందని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.