షాబాద్, మార్చి 17 : జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తమ ఫలితాల కోసం కృషి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్‌తో పదో తరగతి పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యాభ్యాసానికి పునాదిగా నిలిచే పదో తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి చక్కగా పరీక్ష రాసి ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిలో విషయ పరిజ్ఞానం పెంపొందింపజేయాలని సూచించారు. చదువులో వెనకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేలా తరగతులు నిర్వహించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. మే 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగనున్న నేపథ్యంలో పరీక్షల సన్నద్ధతపై వారికి మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన జరిగేలా చూడాలని, అందుబాటులో ఉన్న సమయాన్ని, స్థానిక వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే ఎక్కువ శాతం చదువుతున్నందున, వారికి చక్కటి భవిష్యత్‌ను అందించాలనే సదాశయంతో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ వారి విధులు సక్రమంగా నిర్వర్తిస్తే సరిపోదని, బాధ్యతగా పూర్తి స్థాయిలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన బోధన అందుతుందా లేదా అన్నది నిశితంగా గమనించాలని తెలిపారు. సక్రమంగా విధులు నిర్వర్తించని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, జిల్లాలోని ఆయా మండల విద్యాధికారులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ స్కూల్స్ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.