రంగారెడ్డి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఇటీవల కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లా నిండుకుండలా మారింది. వర్షాకాలం ముగియనున్న తరుణంలో వర్షాలు అధిక స్థాయి నుంచి అత్యధిక స్థాయిలో కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండాయి. సాధారణ స్థాయిని మించి కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. వానకాలం ఆరంభం నుంచి పరిశీలించి చూస్తే రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి అలుగుపారాయి. రంగారెడ్డి జిల్లాలో ఉన్న 27 మండలాల్లోని ఒక్క మొయినాబాద్ మండలంలో తప్ప.. మిగతా అన్ని మండలాల్లో వర్షాలు భారీ స్థాయిలో కురిశాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాలూ పెరిగాయి. దీంతో వచ్చే యాసంగికి పుష్కలంగా నీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనుకూలించిన రుతు పవనాలు
ఒక సంవత్సరానికి సాధారణ వర్షపాతం 694.6మి.మీ కాగా.. నైరుతి, ఈశాన్య రుతు పవనాల నేపథ్యంలో ఇప్పటికే సాధారణ వర్షపాతం స్థాయిని మించి వర్షాలు పడ్డాయి. నైరుతి రుతు పవనాలతో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) వర్షపాతం 506.6మి.మీ కాగా.. 794.6మి.మీగా నమోదైంది. ఈశాన్య రుతు పవనాలతో (అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు) వర్షపాతం 546మి.మీ కాగా.. 859.9మి.మీగా నమోదైంది. రుతు పవన కాలం ముగియక ముందే కురవాల్సిన దాని కంటే భారీ స్థాయిలో వర్షాలు పడటం గమనార్హం. ఒక్క జూలై నెలలోనే సాధారణంగా 153మి.మీ కాగా.. 346.1మి.మీ వర్ష పాతం నమోదైంది.
గత ఆరేండ్లలొ వర్షపాతం..
జిల్లాలో గత ఆరేండ్లుగా వర్షం పడ్డ తీరును పరిశీలించవచ్చు. 2017-2018లో సాధారణ స్థాయిని మించి 889.8మి.మీ.గా వర్షపాతం నమోదైంది. 2018-2019లో సాధారణ స్థాయికి తగ్గి 489.8, 2019-2020లో సాధారణ స్థాయిని మించి 745.8, 2020-2021లో సాధారణ స్థాయిని మించి 1225.2, 2021-2022లో సాధారణ స్థాయిని మించి 952.8, 2022-2023లో ప్రస్తుతానికి సాధారణ స్థాయిని మించి 857.9మి.మీ.గా వర్షపాతం నమోదైంది. ఇప్పటికే 57.1 శాతం అధికంగా కురిసినట్టు రికార్డులు చెబుతున్నాయి.
జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు
జిల్లాలోని 27 మండలాలకు 14 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, 12 మండలాల్లో భారీ స్థాయిలో వర్షం పడింది. దీని కారణంగా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. ఒక్క మొయినాబాద్ మండలంలో కేవలం 19 శాతం వర్షపాతం నమోదైంది. కాగా, జిల్లాలో అనావృష్టిగా ఏ ఒక్క ప్రాంతం లేదు. ఆమనగల్లు మండలంలో అత్యధికంగా 167 శాతం నమోదైంది. చౌదరిగూడెంలో 97, షాబాద్‌లో 96, తలకొండపల్లిలో 94, మాడ్గులలో 78 కేశంపేటలో 77, ఇబ్రహీంపట్నంలో 75, నందిగామ మండలంలో 74 శాతం నమోదైంది. జిల్లాలో గురువారం ఒక్కరోజే 19 మండలాల్లో మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షం పడింది. ఒక మండలంలో భారీ స్థాయిలో, మరొక మండలంలో అత్యధిక భారీ స్థాయిలో వర్షం పడింది. కాగా, ఆరు మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. ఒక్క ఆమనగల్లు మండలంలోనే అత్యధికంగా 122.9 మి.మీ.గా వర్షపాతం నమోదైంది.
ఇప్పటికే భారీస్థాయిలో వర్షాలు..
వర్షాలు నైరుతి రుతు పవన కాలంలోనే అధికంగా పడుతాయి. సెప్టెంబర్‌తో నైరుతి కాలం ముగిసింది. ఈశాన్య రుతు పవన కాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఈ రెండు కాలాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. గత ఐదారేండ్లుగా అనావృష్టి అనేది ఏమీ లేదు. నైరుతి కాలంలో జిల్లాలో 694.6మి.మీ.గా వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 794.6గా అది నమోదైంది. ఇక ఈశాన్య రుతు పవనాలతో వర్షపాతం 859.9మి.మీగా నమోదైంది. ఇప్పటికే భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. గతేడాది 6.74 మీటర్ల లోతులో నీరు లభ్యమయ్యేది. ప్రస్తుతం, 5.41 మీటర్లపైనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. కాగా.. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రం అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
– ఓం ప్రకాశ్, జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా