ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 8: ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నీటితో కళకళలాడుతున్నది. 47 ఏం డ్ల తర్వాత 40 అడుగుల వరకు నీరు చేరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిండిన చెరువు, పొంగిపొర్లుతున్న అలుగును చూసేందు కు గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారితోపాటు నగరవాసులు కూడా అధిక సం ఖ్యలో తరలివస్తున్నారు. చిన్నారుల నుంచి వృ ద్ధుల వరకు చెరువులోని నీటిని చూసేందుకు తరలివస్తుండటంతో ఉప్పరిగూడ ఎక్స్‌రోడ్డు మొదలుకుని పెద్దచెరువు పెద్ద తూము వరకు సాగర్ రహదారి వాహనాలతో పూర్తిగా నిండిపోయింది. ఉదయం 5గంటల నుంచే ఉప్పరిగూడ, పోచా రం, శేరిగూడ, ఇబ్రహీంపట్నం, మంగల్‌పల్లి, కర్ణంగూడ తదితర గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పెద్ద చెరువు తూము వద్ద గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం చిన్నచెరువు కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో చిన్నచెరువులో నిర్మించిన అనేక ఇండ్లు నీట మునిగాయి. నీట మునిగిన ఇండ్లను ఖాళీచేసి ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. బాధితుల కోసం అధికారులు రెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాం తం నుంచి వచ్చే నీటితో చిన్నచెరువులోనూ నీటి ప్రవాహం పెరుగుతుండటంతో చెరువు సమీపంలోని పలు కాలనీలు నీటమునిగాయి.
47 ఏండ్ల తర్వాత..
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు 1975లో పూర్తిస్థాయిలో నిండి అలుగు పారింది. అప్పటి నుంచి సుమారు 47 ఏండ్ల తర్వాత మళ్లీ పెద్ద చెరువు తోపాటు చిన్నచెరువు కూడా పూర్తిగా నిండి అలుగులు పారుతున్నాయి. పెద్దచెరువు నీటి సామ ర్థ్యం పూర్తిస్థాయిలో నిండినప్పటికీ ఎగువ ప్రాం తం నుంచి వచ్చే వరద నీటితో అలుగు నుంచి పెద్ద ఎత్తున నీరు కిందికి వెళ్తున్నది. శనివారం రా త్రి వరకు అలుగు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నది. దీంతో ఉప్పరిగూడకు రాకపోకలు పూర్తి గా నిలిచిపోయే అవకాశమున్నది. ఉప్పరిగూడ, పోచారం గ్రామాలకెళ్లే ప్రధాన రహదారిపై నుం చి అలుగు పారుతుండటంతో వాహనదారులకు తిప్పలు తప్పటం లేదు.
గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుదీర్ఘకాలం తర్వా త పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతుండటం తో శనివారం ఉదయం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భరత్‌రెడ్డితోపాటు టీఆర్ఎస్ నాయకులు జగదీశ్, సుదర్శన్‌రెడ్డి, దాసు, శంకర్, బుగ్గరాములు, కౌన్సిలర్లు జగన్, మమత, పద్మ, శ్వేత, శ్రీలత గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కోదండరెడ్డి కూడా వేర్వేరుగా గంగమ్మతల్లికి పూజలు చేశారు.
సెల్ఫీల సందడి..
పెద్దచెరువులోని నీటిని, అలుగును చూసేందుకు ఉదయం ఐదు గంటల నుంచే అధిక సంఖ్యలో ప్రజలు ఉప్పరిగూడగేటు సమీపంలోని అలుగు వద్దకు చేరుకున్నారు. అక్కడ స్నానాలు చేసి సెల్ఫీలు దిగారు. మత్స్యకార కుటుంబాలు, ఆయకట్టు ప్రాంతాల రైతులు కూడా అధిక సం ఖ్యలో చెరువు వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా చిన్నచెరు వు కూడా పూర్తిస్థాయిలో నిండటంతో చెరువుకు సమీపంలో ఉన్న ఇండ్లు నీటమునిగాయి. కాగా, చిన్నచెరువు తూము నుంచి నీటిని కిందికి వదలాలని ముం పునకు గురైన బాధితులు ఆందోళన చేపట్టగా.. చెరువులోని నీటిని వదలొద్దని మత్స్యకార కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. దీంతో అధికారులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు.
పర్యాటక కేంద్రంగా మారుస్తాం
ఇబ్రహీంపట్నం పెద్దచెరువును త్వరలోనే పర్యాటక కేంద్రంగా మారుస్తాం. ఇందుకో సం ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ను కలిసి రూ. రెండు కోట్ల నిధులను కేటాయించాలని కోర గా.. ఆయన సానుకూలంగా స్పందించారు. నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తాం. -మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే