యాచారం, అక్టోబర్ 2: ఈత సరదా.. నలుగురు చిన్నారుల ప్రాణాలు తీసింది. ఈ ఘటన మండలంలోని గొల్లగూడ గ్రామంలో ఆదివారం జరిగింది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. మండలంలోని తాటిపర్తి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న గొల్లగూడ గ్రామానికి చెందిన మహ్మద్ కాశీం-బీబీ, మహ్మద్ హుస్సేన్-ఫర్జానా, సయ్యద్ రజాక్-ఆస్మాబేగంలు తమ పిల్లలతో కలిసి గ్రామానికి దగ్గరలో ఉన్న దర్గావద్దకు వెళ్లారు. అక్కడ దర్గాను దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించి, సరదాగా పిల్లలతో కొద్దిసేపు గడిపారు. దర్గా నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా పిల్లలు తల్లిదండ్రుల కంటే ముందే పరుగెత్తుకుంటూ వచ్చారు. మార్గమధ్యంలో ఉన్న ఎర్రకుంటలో సరదాగా ఈత కొట్టేందుకు కాశీం కుమారుడు మహ్మద్ ఖలీద్(12), కుమార్తె సమ్రీన్ (14), రజాక్ కుమారుడు రెహాన్ (10), హుస్సేన్ కుమారుడు ఇమ్రాన్(9) నీటిలోకి దిగారు. అయితే గతంలో జేసీబీతో కుంటలో గోతు లు తీయటంతో చిన్నారులు ఈతకొట్టుకుంటూ వెళ్లి ఆ గుంతలో పడిపోయారు.
అక్కడే ఉన్న పశువుల కాపరులు చిన్నారులు కుంటలోకి వెళ్లి తిరిగి బయటికి రాకపోవడాన్ని గమనించి స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చిన స్థానికులు కుంటలోకి దిగి చిన్నారులను వెలికితీశారు. అప్పటికే నలుగురు చిన్నారులు మృతి చెందటంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు కండ్ల ముందే ఉన్న చిన్నారులు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించా రు. కాగా సమ్రీన్ కుర్మిద్ద ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతుండగా.. ఖలీద్ పుడమి పాఠశాలలో ఎనిమిదోతరగతి చదువుతున్నాడు. రెహాన్ ఇబ్రహీంపట్నంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదోతరగతి, ఇమ్రాన్ తాటిపర్తి పుడమి పాఠశాలలో నాల్గోతరగతి చదువుతున్నాడు. మహ్మద్ కాశీం-బీబీల కొడుకు ఖలీద్, కుమార్తె సమ్రీన్ ఇద్దరు కుంటలో మునిగి మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమారుడు, కుమార్తెల మృతదేహాలను చూసిన బీబీ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయింది. హుస్సేన్- ఫర్జానా, రజాక్ -ఆస్మాత్బేగంలు బోరున విలపించారు. చెరువు వద్దకు స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
సరదాగా ఈత కొట్టేందుకు..
పండుగ పూట, సెలవు రోజు కావటంతో సరదాగా గడిపేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన చిన్నారులు కొద్ది సమయంలోనే కుంటలోకెళ్లి మృతి చెందటంతో గొల్లగూడ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈత సరదా నలుగురు చిన్నారుల నిండు ప్రాణాలను బలి తీసుకున్నది. చిన్నారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు రోదించారు. యాచారం సీఐ లింగయ్య తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎంపీపీ సుకన్య, సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ బాబు, పీఏసీఎస్ డైరెక్టర్ శశికళ, మైనార్టీ సంఘాల నాయకులు, వివిధ పార్టీ ల నాయకులు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారుల కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటంతో గ్రామమంతా విషాదం నెలకొన్నది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.