ఆమనగల్లు, అక్టోబర్ 1: తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్‌ను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో జారీ చేయడాన్ని హర్షిస్తూ శనివారం ఆమనగల్లు పట్టణంలోని హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఎస్సీ,ఎస్టీ యాక్ట్ విజిలెన్స్ కమిటీ సభ్యు డు నేనావత్ పత్యానాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనస్సున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ శుక్రవారం రాత్రి జీవోను జారీ చేయడం అభినందనీయమన్నారు. రిజర్వేషన్ల పెంపుతో గిరిజనులకు విద్యాఉద్యోగ రంగాల్లో ఎంతో జరుగుతుందన్నారు. గిరిజన బంధవుడు సీఎం కేసీఆర్‌కు యావత్ గిరిజన జాతి జీవితాంతం రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి , ఏఎంసీ డైరెక్టర్ రమేశ్‌నాయక్, శ్రీనూనాయక్, లక్ష్మణ్‌నాయక్, జీర్యానాయక్, పంతూనాయక్, రైసల్నాయక్, భాస్కర్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు. గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని పదికి పెంచి గిరిజన బాంధవుడయ్యారు. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి జీవో నంబర్ 33 జారీ చేయడం హర్షణీయం. రిజర్వేషన్ పెంపునకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. సీఎంకు గిరిజనులంతా అండగా ఉంటారు.
-రాజూనాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్, శంకర్పల్లి
సీఎం కేసీఆర్ రిజర్వేషన్‌ను పది శాతానికి పెంచి గిరిజనులకు దసరా కానుకను అందించారు. ఆయనతోనే గిరిజనుల అభ్యున్నతి సాధ్యం. ఇప్పటికే గిరిజన తండాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. దేశం కూడా మరింత అభివృద్ధి చెందుతుంది.
– సంజూనాయక్, టీఆర్ఎస్వీ నాయకుడు షాద్‌నగర్‌టౌన్