రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
జంట హత్యల కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విచారణ జరిపిన అధికారులు
ఇబ్రహీంపట్నం, మార్చి 16 : రాచకొండ కమిషనర్రేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో సంచలనం రేపిన రియల్ ఎస్టేట్ జంట హత్యల కేసులో ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డిని బుధవారం బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులో ఇప్పటికే ఒక ఎస్సైతోపాటు ఏసీపీ కార్యాలయంలో పనిచేసే మరో ఉద్యోగిని కూడా రాచకొండ హెడ్ క్వార్టర్‌కు బదిలీచేశారు. బుధవారం ఏసీపీని రాచకొండ కమిషనర్రేట్కు అటాచ్ చేశారు. కర్ణంగూడ గ్రామంలో తలెత్తిన భూ వివాదానికి సంబంధించి గతంలో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలపై ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లనే వీరి హత్యలు జరిగాయని పోలీసులు మొదటగా నిర్ధారణకు వచ్చారు. దీనిపై రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ స్పందిస్తూ పూర్తి సంఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీచేయగా.. సమగ్ర విచారణ జరిపి ఈ చర్యలు తీసుకున్నారు. కర్ణంగూడ భూవివాదంలో నిర్లక్ష్య వైఖరితోనే రెండు హత్యలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. లేక్‌విల్లా రిసార్ట్స్ యాజమాన్యం గతంలో భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించింది. రికార్డుల ప్రక్షాళన తరువాత లేక్‌విల్లా యాజమాన్యానికి అమ్మిన వ్యక్తులపైనే మళ్లీ పాస్‌బుక్కులు రావడంతో వారు ఈ భూమిని శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలకు విక్రయించగా.. ప్లాట్ల యాజమానులు ఆందోళనకు గురయ్యారు.
ఓవైపు శ్రీనివాస్‌రెడ్డి, మరోవైపు మట్టారెడ్డి ఈ భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ప్లాట్ల యజమానులు పలుమార్లు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపైనే రాచకొండ కమిషనర్‌ను కూడా ప్లాట్ల యాజమానులు కలిసి మొరపెట్టుకున్నారు. వారి ఫిర్యాదులు తీసుకుని సమగ్ర విచారణ జరుపాలని సీపీ ఆదేశాలు జారీచేశారు. గతంలో పలు భూవివాదాల్లో ఏసీపీ తలదూర్చాడని ఆరోపణలు వచ్చాయి. పోల్కంపల్లికి చెందిన రాఘవరావు అనే వ్యక్తి ఏసీపీ భూ వివాదంలో తలదూర్చి తమను ఇబ్బందులకు గురిచేశాడని సీపీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి చర్య తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ ఫిర్యాదులన్నింటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి బదిలీ కావడంతో ఆ స్థానంలో భువనగిరి ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న శంకరయ్యను ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. జంట హత్యల కేసులో నిందితుల పోలీసు కస్టడి బుధవారంతో ముగిసింది. వీరిని ఇబ్రహీంపట్నం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఈ కేసులో మొదటి ముద్దాయి మట్టారెడ్డిని మరొక్కరోజు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో ఇబ్రహీంపట్నం న్యాయమూర్తి అనుమతిచ్చారు.