ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 28 : దేశంలో బీజేపీ ప్రభుత్వం బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని జూనియర్ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రవి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..బీజేపీ అధికార దుర్వినియోగం పతాకా స్థాయికి చేరుకుందన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఈడీ నోటీసులు బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈడీ విచారణకు హాజరైనంత మాత్రాన ఏదో తప్పు చేసినట్లు కాదన్నారు. 2015లో ఎమ్మెల్యే మనీలాండరింగ్‌కి పాల్పడ్డారనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. సమావేశంలో బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది జగన్, న్యాయవాదులు కుమార్, బాను పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని విమర్శించే నైతికహక్కు మల్రెడ్డి రంగారెడ్డికి లేదని, మల్రెడ్డి రంగారెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ…పాన్‌డబ్బాలు, హోటల్లు, తోపుడు బండ్లమీద డబ్బులు వసూళ్లుచేసే మల్రెడ్డి రంగారెడ్డికి ఎమ్మెల్యేని విమర్శించే అర్హత లేదన్నారు. ఈడీ ప్రశ్నించినంత మాత్రాన అరెస్టు చేయాలని చిల్లర కూతలు కూస్తే ఎవరు సహించరని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, ఎంపీటీసీలు అచ్చన శ్రీశైలం, మంగ, నాగమణి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చటమే పనిగా పెట్టుకుని కుట్రలు పన్నుతుందన్నారు. రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు.
తుర్కయాంజాల్ : ఈడీ, మోదీలు జోడిగా ఏర్పడి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ జోడితో టీఆర్ఎస్ పార్టీకి ఒరిగే నష్టం ఏమీ లేదని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. రాగన్నగూడలోని జేఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ ఈడీ వంటి సంస్థలతో రాజకీయం చేస్తున్నదన్నారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ సామ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదిబట్ల : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పై ఆరోపణలు మానుకోవాలని ఆదిబట్ల మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు పల్లె గోపాల్‌గౌడ్, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు జంగయ్య అన్నారు. ఆదిబట్ల లో విలేకర్లతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధంగా ఉన్నాడన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ కుట్రలు చేస్తున్నదన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.