సిటీబ్యూరో, సెప్టెంబరు 27 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నది. పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు అనువుగా గ్రేటర్‌తో పాటు శివారు మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున లింకు రోడ్లను నిర్మిస్తున్నారు. రూ. 2140 కోట్లతో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) లింకు రోడ్లను అభివృద్ధి చేస్తూ ట్రాఫిక్ ఇబ్బందుల్లేని నగరంగా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగానే తొలి విడుతలో రూ. 275.53 కోట్లు ఖర్చు చేసి 22 చోట్ల కలిపి 24.30 కిలోమీటర్ల మేర లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఎక్కువ శాతం వెస్ట్ జోన్లోనే ఉండగా.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చాలావరకు పరిష్కారం లభించింది. ఈ క్రమంలోనే కోర్ సిటీలోనూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్లు ఒక్కటే మార్గం కాదని భావించి లింకు రోడ్ల సాహసోపేతమైన నిర్ణయం మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఒక్క ఫ్లై ఓవర్‌కు పెట్టే ఖర్చులో నాలుగు లింకు రోడ్లు వేయొచ్చనే ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రూ. 207.26 కోట్లతో 20.16 కిలోమీటర్ల మేరలో పనులు చేపట్టగా..70 శాతం మేర పనులు పూర్తి అయ్యాయి.
తాజాగా ఫేజ్-3కి శ్రీకారం చుట్టారు. 50 రోడ్లను 120.92 కి.మీ మేర నిర్మించేందుకు సుమారు రూ.1500 కోట్లతో పనులు చేపట్టారు. శివారు మున్సిపాలిటీల్లో పనులు పట్టాలెక్కగా.. మిగిలిన చోట టెండర్ దశలో ఉన్నాయి. పనులు చేపట్టే వాటిలో కొత్తూరు, శంషాబాద్, బడంగ్‌పేట, ఇబ్రహీంపట్నం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్, నాగారం, పోచారం, బండ్లగూడ జాగీర్, ఘట్కేసర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కోర్ సిటీలో ప్రస్తుతం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, అలాంటి పరిస్థితి శివారు ప్రాంతాల్లో తలెత్తకుండా రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. వచ్చే 50 ఏండ్ల వరకు ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా సాగిపోయేలా రోడ్ నెట్ వర్క్‌ను కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
టైమ్ మిగిలింది.. ట్రాఫికర్ తప్పింది
గతంలో పెద్ద పెద్ద కొండలు, గుట్టలతో నిండి ఉండేది ఖాజాగూడ లింకురోడ్డు ప్రాంతం. కొవిడ్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లింకురోడ్ల నిర్మాణం చేపట్టింది. ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రధాన రహదారి నుంచి గచ్చిబౌలి ప్రధాన రహదారి వరకు దాదాపు కిలోమీటరు పైన నాలుగు లేన్ల లింకురోడ్డు వేశారు. హెచ్ఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో రూ.19.51 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ లింక్‌రోడ్డు 1.4 కిలోమీటర్ల మేరకు కేవలం 6 నెలల్లో తీర్చిదిద్దారు. ఈ లింకురోడ్డులో పెద్ద చెరువు పక్క నుంచి నానక్‌రాంగూడ రోటరీకి కలిసే మరో లింకు రోడ్డు (వై ఆకారంలో) దాదాపుగా పూర్తయింది. రోటరీ సమీపంలో కొద్ది మేర పనులు మిగిలి ఉన్నాయి. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ కేబుల్‌బ్రిడ్జి మీదుగా, కూకట్పల్లి వైపు నుంచి హైటెక్‌సిటీ మీదుగా వచ్చే వాహనదారులు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు వెళ్లేందుకు ఈ లింకురోడ్డు మీదుగా వెళ్తున్నారు. ఫలితంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఖాజాగూడ వై జంక్షన్, గచ్చిబౌలి ప్రధాన జంక్షన్లపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా నిత్యం రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులకు విలువైన ప్రయాణ సమయం తగ్గింది.