పరిగి, సెప్టెంబర్ 20 : జిల్లా పరిధిలో గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరుగుతున్నది. దీంతో డీఎంఎఫ్టీ ఫండ్‌తో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై నెల వరకు రూ.36.69కోట్ల ఆదాయం గనుల శాఖ ద్వారా రావడం గమనార్హం. ఈ లెక్కన గత సంవత్సరం కంటే అధికంగా ఆదాయం వచ్చే అవకాశమున్నది. వికారాబాద్ నూతన జిల్లాగా ఏర్పాటైన నాటి నుంచి గనుల శాఖ ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నది. సీనరీ చార్జీల పెంపుతో ఆదా యం మరింత పెరిగేందుకు అవకాశమున్నది.
నాలుగు నెలల్లోనే రూ.36.69కోట్లు
గనుల శాఖ ద్వారా వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల్లో రూ.36.69కోట్లు ఆదాయం చేకూరింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు ఈ ఆదాయం రావడం గమనార్హం. మిగతా 8 నెలల కాలంలో ఆదాయం పెరిగి గత సంవత్సరం కంటే మరింత అధికంగా రానుందని గనుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో వరుసగా గనుల శాఖ ఆదాయాన్ని పరిశీలిస్తే 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.63.75కోట్లు, 2017-18లో రూ.74.75, 2018-19లో రూ.83.75, 2019-20లో రూ.87.63, 2020-21లో రూ.75.06, 2021-22లో రూ.83.63కోట్ల ఆదాయం సమకూరింది.
జిల్లాలో 231 లీజుల ద్వారా ఆదాయం
వికారాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 231 లీజుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతున్నది. ఇందులో 4 పెద్ద తరహా గనులు, 227 చిన్న తరహా గనుల కౌలుకు మంజూరు చేశారు. వాటిలో సున్నపురాయి లీజులు 4, ఎర్రమట్టి 71, మృత్తికలు ఒకటి, షెల్ ఒకటి, సున్నపురాయి పలకలు 60, బంకమట్టి 50, కంకరరాయి 35, గ్రానైట్ 6, పలుగురాయి 3 లీజులు ఉన్నాయి. ప్రతి భూగర్భ వనరుకు సీనరేజ్ చార్జీలు, రాయల్టీ ఒక్కో రకంగా ఉంటుండగా.. వాటికనుగుణంగా రాయల్టీ, సీనరేజ్ చార్జీలు వసూలు చేస్తున్నారు.
జూన్ నెలాఖరు వరకు రూ.10.03కోట్లు సీనరేజ్ ఫీజు
వికారాబాద్ జిల్లా పరిధిలో 2022 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు రూ.10.03కోట్ల సీనరేజ్ చార్జీలు వసూలయ్యాయి. జిల్లాలోని బషీరాబాద్ మండలంలో రూ.70,020, దౌల్తాబాద్ 3,29,292, పెద్దేముల్ 1,71,90,038, తాండూరు 1,28,54,597, పూడూరు 37,58,680, దోమ 9,98,677, నవాబుపేట 3,22,35,159, మోమిన్‌పేట 2,01,58,773, వికారాబాద్ 97,80,615, బొంరాస్‌పేట 5,52,800, పరిగి 50,000, కోట్‌పల్లి 12,57,933, మర్పల్లి 4,37,000, కులకచర్ల 2,21,000, బంట్వారంలో 4,35,500 సీనరేజ్ ఫీజులు వసూలయ్యాయి. మూడు నెలల్లోనే రూ.10కోట్లు దాటడంతో సంవత్సరంలో సీనరేజ్ ఫీజు రూ.40కోట్లు దాటనుంది.
2021 ఏప్రిల్ 1 నుంచి 2022 జూన్ 30 వరకు వసూలు చేసిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ రుసుము వివరాలు
మండలం: ట్రస్టు రుసుము రూ.లలో
బషీరాబాద్ : 29,250
దౌల్తాబాద్: 1,17,000
పెద్దేముల్: 50,31,099
తాండూరు: 3,29,01,033
యాలాల: 1,695
పూడూరు: 12,84,900
దోమ : 2,04,735
నవాబుపేట : 95,37,258
మోమిన్‌పేట : 62,08,812
వికారాబాద్ : 26,00,115
బొంరాస్‌పేట : 55,590
పరిగి : 15,000
కోట్‌పల్లి : 3,34,439
కులకచర్ల : 72,184
బంట్వారం : 1,43,400
ఇతర శాఖలు : 1,58,374
మొత్తం : 5,86,94,884