రంగారెడ్డి, ఫిబ్రవరి 15, (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా జిల్లా రైతాంగానికి పారదర్శకంగా సేవలందుతున్నాయి. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం పరిష్కరిస్తున్నది. దీంతో రైతులకు డబ్బుతోపాటు సమయం కూడా ఆదా అవుతున్నది. ధరణి పోర్టల్ ద్వారా మ్యుటేషన్స్, సక్సెషన్స్, ప్రొహిబిటెడ్, జీపీఏ తదితరాలకు సంబంధించి జిల్లాలో లక్షా పదివేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 97 శాతం దరఖాస్తులను పరిష్కరించి రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో నిలిచింది. కలెక్టర్ అమయ్‌కుమార్ ప్రత్యేక చొరవతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. కేవలం సోమవారం నిర్వహించే ప్రజావాణిలోనే వినతులను స్వీకరించడం కాకుండా.. ప్రతి రోజు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, జిల్లా పాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పటికీ ధరణి దరఖాస్తులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతున్నారు. మ్యుటేషన్స్, సక్సెషన్‌కు సంబంధించి కూడా ఆలస్యం చేయకుండా రెవెన్యూ యంత్రాంగం ఆమోదం తెలుపుతున్నది.
జిల్లాలో ఇప్పటివరకు ధరణికి మొత్తం 1,10,763 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటికే 1,06,637 దరఖాస్తులను పరిష్కరించగా.. 4126 పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టర్ మొదలుకొని ఆయా మండలాల తాఇసిల్దార్ల వరకు తమ లాగిన్‌కు వచ్చే దరఖాస్తులకు వెంటనే పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా మ్యుటేషన్స్, సక్సెషన్స్, ఆధార్ సీడింగ్, జీపీఏ, ఆర్గనైజేషన్ పీపీబీ, ప్రొహిబిటెడ్ జాబితా, పీపీబీ లేకుండా సక్సెషన్, కోర్టు కేసుల ద్వారా పీపీబీ, పాస్ పుస్తకం లేకుండా నాలా, కోర్టు కేసు-ఇంటిమేషన్, పీపీబీ-నాలా, అన్‌లాక్ పీపీబీ ఆఫ్ పీపీ ఆప్షన్లు నిర్వహిస్తున్నారు. మరిన్ని ఆప్షన్లు ఇచ్చేందుకుగాను ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిన దృష్ట్యా త్వరలోనే రానున్నాయి. అదేవిధంగా ఆయా ప్రాంతాలను బట్టి పోర్టల్‌లోనే స్టాంప్ డ్యూటీ ధరలు చూపిస్తుండడంతో డాక్యుమెంట్ రైటర్స్ కానీ, మీసేవ నిర్వాహకులుగాని అధికంగా డబ్బులు వసూలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. గతంలో మాదిరిగా మారుమూల గ్రామం నుంచి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సక్సెషన్, పార్టీషన్ సేవలకై పట్టణాలకు రావాల్సిన అవసరం లేకుండా మండల కేంద్రాల్లోనే సేవలు అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా రోజుల తరబడి తిరగాల్సిన పనిలేకుండా త్వరగా పని పూర్తవుతున్నది. అంతేకాకుండా ధరణి పోర్టల్‌తో అవినీతికి అడ్డుకట్టపడింది.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో భూములకు సంబంధించి పెండింగ్ దస్ర్తాలు లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. గతంలో వారసత్వంగా వచ్చే భూములను వారసుల పేరిట మార్చేందుకు రైతులు ఏండ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. 45 రోజుల్లో పూర్తి చేయాల్సిన వారసత్వ రిజిస్ట్రేషన్‌ను సంవత్సరాలు గడిచినా పూర్తయ్యేది కాదు. సంబంధిత రెవెన్యూ అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పితేగాని పని అయ్యేది కాదు. అంతేకాకుండా వీఆర్వో స్థాయి నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తాసిల్దార్, తాసిల్దార్, ఆర్డీవో వరకు లంచం ఇవ్వక తప్పని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం రైతులకు ఈ బాధలన్నీ తప్పాయి. వారసత్వ రిజిస్ట్రేషన్ కోసం పట్టాదారు పాసు పుస్తకం, పట్టాదారు మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల అంగీకార పత్రం, ఇద్దరు సాక్షుల ఆధార్ కార్డులతో మీ సేవలో స్లాట్ బుక్ చేసిన 24 గంటల్లో రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతోపాటు కుటుంబ సభ్యుల పేరిట వెంటనే కొత్త పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఒరిజినల్ పట్టాదారు పాసు పుస్తకం నేరుగా రైతుల ఇంటికే పంపిస్తున్నారు. స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు ధరణి పోర్టల్ ద్వారానే ప్రక్రియ జరుగుతుండడంతో అవినీతికి చరమగీతం పాడినట్లయింది.
జిల్లాలో ధరణి దరఖాస్తులకు సత్వరమే పరిష్కారం చూపుతున్నాం. తమ లాగిన్‌కు వచ్చే ఏ ఒక్క దరఖాస్తును కూడా పెండింగ్‌లో ఉండకుండా చూస్తున్నాం. పాలనా కార్యక్రమాలు, ప్రొటోకాల్ ఇతర కార్యక్రమాలు ఉన్నప్పటికీ ధరణి దరఖాస్తులకు ప్రత్యేక సమయం కేటాయిస్తున్నాం. అదేవిధంగా ధరణి పోర్టల్‌తో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు పారదర్శక సేవలు అందుతున్నాయి.
– అమయ్‌కుమార్, రంగారెడ్డి కలెక్టర్