తుర్కయాంజాల్, మే 25 : 50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నదని.. దీంతో తాము రోడ్డున పడతామని కొహెడ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడ రెవెన్యూ సర్వే నం.167/1 వద్ద రైతులు విలేకరులతో మాట్లాడారు. సర్వే నం.167/1లోని సుమారు 266 ఎకరాల భూమిని కొహెడకు చెందిన సుమారు వంద మందికి పైగా రైతు కుటుంబాలకు చెందినవారిమి గత 50 ఏండ్లుగా సాగు చేసుకుని జీవిస్తున్నామన్నారు.
ఇటీవల రెవెన్యూ అధికారులు 266 ఎకరాలకు ఫ్రీకాస్ట్ వాల్‌ను ఏర్పాటు చేసేందుకు యత్నించగా తాము అడ్డుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు 50 ఏండ్ల కిందట భూమి లేని కుటుంబాలకు వ్యవసాయం చేసుకుని బతుకుమని ఎకరా.. రెండు ఎకరాల చొప్పున కేటాయించగా.. అప్పటి నుంచి ఆ భూముల్లో జొన్నతోపాటు పలు రకాల పంటలను పండించుకుంటూ జీవిస్తున్నామన్నారు. ఆ భూములను తీసుకుంటే తాము రోడ్డున పడతామని.. ప్రభుత్వం ఆలోచించి.. తమ భూముల జోలికి రావొద్దని విజ్ఞప్తి చేశారు.