షాద్‌నగర్, జూలై 31 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సర్కారు అభివృద్ధి పనులు చేపడుతున్నది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోగా, రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. సర్కారు దవాఖాన, ఆర్ఓబీ పనులు ప్రారంభం కానున్నాయి. మాడల్ మార్కెట్, గ్రంథాలయ భవనం, ఆడిటోరియం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధానదారుల్లో కోట్ల నిధులను వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాన పనులను పూర్తిచేశారు.
పాత జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొత్తూరు మండల కేంద్రం నుంచి షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ బైపాస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రూ. 67.75 కోట్ల నిధులతో నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలో దాదాపుగా రోడ్డు విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వంతెనల నిర్మాణాలు మినహా సాధరణ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో ఈ రహదారి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు, సాఫీగా ప్రయాణం సాగడంతో పాటు రోడ్డు పరిసర ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి.
100 పడకల దవాఖాన నిర్మాణానికి ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో రూ. 20.89 కోట్ల నిధులను వెచ్చించి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫరూఖ్‌నగర్ మండలం అలిసాబ్‌గూడ రెవెన్యూ పరిధిలో సుమారు 5 ఎకరాల విస్తరణలో వంద పడకల భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ట్రామ కేర్ సెంటర్, డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తేనున్నారు. అదే విధంగా గ్రంథాలయం, కళాకారులకు వేదికగా ఆడిటోరియం, సకల సదుపాయాలతో షాద్‌నగర్ మున్సిపాలిటీలో నూతనంగా గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. రూ. 1.88 కోట్ల నిధులతో భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
పాఠకులు కూర్చునేందుకు విశాలమైన గదులతో పాటు, ఈ లైబ్రరీ గదులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక గదులను నిర్మిస్తున్నారు. మండల పరిషత్ ఆవరణలో రూ. 5 కోట్ల నిధులను వెచ్చించి ఆధునిక సాంకేతిక విధానంతో ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. పార్కింగ్, థియేటర్, కళాకారుల ప్రదర్శ వేదిక, కళాకారులు సేద తీరేందుకు వసతులు, సౌండ్, లైటింగ్ సిస్టమ్ వంటి వసతులతో ఆడిటోరియం అందుబాటులోకి రానున్నది.
మున్సిపల్ వాసుల అవసరాలకు అనుగుణంగా షాద్‌నగర్ పట్టణంలో రూ.5 కోట్ల నిధులతో నూతనంగా మున్సిపల్ భవనాన్ని నిర్మించారు. పనులు పూర్తి కాగా, ప్రారంభానికి సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మున్సిపల్ శాఖ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అనువుగా విధులను నిర్వహించేందుకు విశాలమైన గదులను నిర్మించారు.
మున్సిపాలిటీలోని పాత కూరగాయల మార్కెట్ ఆవరణలో రూ. 4.5 కోట్ల నిధులను వెచ్చించి మోడల్ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. ఒకేచోట కూరగాయలు, ఆకు కూరలు, మాంసం, చేపలను విక్రయించేందుకు 108 దుకాణాలను నిర్మిస్తున్నారు.
ట్రాఫిక్ అధికంగా ఉండే కాలనీలో రూ. 4.5 కోట్ల నిధులను వెచ్చించి సీసీ రోడ్లను ఏర్పాటుచేశారు. విజయ్‌నగర్ కాలనీ, నాగులపల్లి రోడ్డు, ఫరూఖ్‌నగర్ ఎస్సీ కాలనీ రోడ్డు, కోర్టు భవనం రోడ్డు, విద్యుత్ కాలనీ ప్రధాన రోడ్లను ఆధునీకరించారు.
ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చటాన్‌పల్లి రైల్వే గేట్ వద్ద రూ. 95 కోట్ల నిధులను వెచ్చించి వంతెనను నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. త్వరలోనే పనులు ప్రారంభవుతాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అండర్ పాస్ రోడ్డు సౌకర్యం కూడా అందుబాటులోకి రానున్నది.
నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం తమ వంతుగా శాయశక్తుల పనిచేస్తా. పాత జాతీయ రహదారి, చటాన్‌పల్లి బిడ్జీ, ఆడిటోరియం, మాడల్ మార్కెట్, సర్కారు దవాఖాన వంటి పనులు ప్రారంభం కావడం సంతోషకరం. సీఎం కేసీఆర్ సహకారంతో మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషిచేస్తా. ప్రజల సహకారంతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా.
– వై. అంజయ్యయాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే
షాద్‌నగర్ నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎండకాలం వచ్చిందంటే నీటి గోస ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా పట్టణ వాసులకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం. రూ. కోట్లను వెచ్చించి అన్ని కాలనీల్లో పనులను చేపడుతున్నాం.
– కె. నరేందర్, మున్సిపల్ చైర్మన్, షాద్‌నగర్ మున్సిపాలిటీ