ఒకప్పటి పల్లెలను, ఇప్పటి పల్లెలను పోల్చి చూస్తే చాలా మార్పు వచ్చింది. ఇప్పటికే ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి. పల్లెలను మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రతి మండలానికి మూడు, లేదా నాలుగు గ్రామాల చొప్పున వికారాబాద్ జిల్లాలో 71 పల్లెలను ఎంపిక చేశారు. ఎంపికైన గ్రామాల్లో ఏఏ పనులు చేపట్టాలి.. ఎప్పటిలోగా పూర్తి చేయాలన్న దానిపై ప్రణాళికను సైతం రూపొందించారు. పనులు సక్రమంగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక ఇన్చార్జి అధికారులను సైతం నియమించారు. నిర్దేశించిన సమయం లోపు 9 అంశాల పనులను పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రోడ్లు, మొక్కలు నాటడం, పల్లెప్రకృతి వనాలు, బృహత్వనాలు, క్రీడా ప్రాంగణాలతో పాటు వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం, ఇంటింటికీ తప్పనిసరిగా ఇంకుడు గుంతలు తదితర పనులను పూర్తి చేయనున్నారు. పనులు ఎలా సాగుతున్నాయని ఎంపీడీవో, ఎంపీవో, ప్రత్యేకాధికారులు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
పరిగి, జూలై 31: పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయి. గతంలో ఊరుకు ఆనుకొనే పెంటకుప్పలు దర్శనమిచ్చేవి. పల్లె ప్రగతితో గ్రామాల స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. అంతేకాకుండా జిల్లాలోని ప్రతి మండలంలో మూడు నుంచి నాలుగు గ్రామాలను ఎంపిక చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నది అధికారుల ఆలోచన. అందుకు అనుగుణంగా వికారాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల్లో 71 గ్రామాలను ఎంపిక చేసి ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు పంపించారు. ఎంపికైన గ్రామాల్లో ఏఏ పనులు చేపట్టాలన్నది సూచించడంతో పలు గ్రామాల్లో ఆ దిశగా పనులు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు పనులు సక్రమంగా జరిగేలా చూసేందుకు ప్రత్యేకంగా ఇన్చార్జీ అధికారులను సైతం నియమించారు. తద్వారా సాధ్యమైనంత త్వరగా ఆదర్శ గ్రామాలు పూర్తయ్యేలా పనులు కొనసాగుతున్నాయి.
జిల్లాలోని 18 మండలాల పరిధిలో 71 గ్రామాలను ఎంపిక చేశారు. బంట్వారం మండలంలోని తొర్మామిడి, బస్వాపూర్, రొంపల్లి, బంట్వారం, బషీరాబాద్ మండలం జీవన్గి, దామర్చేడ్, నవాంద్గి, బొంరాస్పేట మండలం నాగిరెడ్డిపల్లి, రేగడిమైల్వార్, చౌదర్పల్లి, ధారూరు మండలం మోమిన్కలాన్, చింతకుంట, అంతారం, కెరెళ్లి, దోమ మండలం దోమ, పాలేపల్లి, మైలారం, ఖమ్మంనాచారం, దౌల్తాబాద్ మండలం చంద్రకల్, దౌల్తాబాద్, నెట్టూర్, మట్టూర్, కొడంగల్ మండలం హుస్సేన్పూర్, హస్నాబాద్, పెద్దనందిగామ, కోట్పల్లి మండలం లింగంపల్లి, కరీంపూర్, ఎన్కెపల్లి, కులకచర్ల మండలం బొట్యనాయక్తాండా, పటేల్చెరువుతాండా, వాల్యనాయక్తాండా, లింగంపల్లి, మర్పల్లి మండలం పెద్దాపూర్, తిమ్మాపూర్, రావులపల్లి, ధరుగులపల్లి, మోమిన్పేట్ మండలం చీమల్దరి, ఎన్కెతల, మొరంగపల్లి, దేవరంపల్లి, గోవిందాపూర్, నవాబుపేట్ మండలం యెల్లకొండ, అర్కతల, మాదిరెడ్డిపల్లి, యావాపూర్, మీనపల్లికలాన్, పరిగి మండలం నస్కల్, నజీరాబాద్తాండా, రుక్కుంపల్లి, సుల్తాన్పూర్, పెద్దేముల్ మండలం గొట్లపల్లి, కొండాపూర్, రుద్రారం, పూడూరు మండలం మన్నెగూడ, మీర్జాపూర్, గంగుపల్లి, సోమన్గుర్తి, తిర్మలాపూర్, ఎన్కెపల్లి, తాండూరు మండలం బెల్కటూర్, గౌతాపూర్, ఖాన్జాపూర్, సిరిగిరిపేట్, వికారాబాద్ మండలం పులుమద్ది, నారాయణపూర్, ఎర్రవల్లి, కామారెడ్డిగూడ, యాలాల్ మండలం రాఘపూర్, పగిడియాల్, కమల్పూర్, కోకట్ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ఎంపిక చేశారు.
నిర్దేశించిన సమయంలోపు 9 అంశాల్లో పూర్తిస్థాయి పనులు చేపట్టడం ద్వారా ఎంపిక చేసిన గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు. మెరుగైన రోడ్లు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడం, సంరక్షించడం, పల్లె ప్రకృతి వనాలు, బృహత్, మినీ పల్లె ప్రకృతి వనాలను అందంగా తీర్చిదిదద్డడం, నర్సరీల నిర్వహణ, తెలంగాణ క్రీడా ప్రాంగణాల నిర్మాణం, సెరిగేషన్ షెడ్లలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడంతోపాటు సేంద్రియ ఎరువు తయారీపై దృష్టి సారించారు. అలాగే ఎంపిక చేసిన గ్రామాల్లోని వైకుంఠధామాలకు విద్యుత్ సదుపాయంతోపాటు నీటి వసతి కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామంలోని ఇంటింటికి ఇంకుడుగుంతల నిర్మిస్తున్నారు. ఇప్పటికే 100శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసినందున వాటిని ఉపయోగించేలా ప్రజలను చైతన్యపర్చుతున్నారు.
పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు గ్రామానికో ప్రత్యేక అధికారిని నియమించారు. ఆయన ఎప్పటికపుడు పనులను పరిశీలించి మరింత వేగంగా జరిగేలా చూస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంపీవో, ప్రత్యేకాధికారులు సైతం పనులను పర్యవేక్షిస్తారు.
ప్రణాళికాబద్దమైన అభివృద్ధి చేసేందుకు ఆదర్శ గ్రామాలను ఎంపిక చేశాం. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన గ్రామాల్లో సుమారుగా వంద రోజులలో నిర్ణయించిన 9 అంశాల్లో వంద శాతం అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ గ్రామాల్లో అన్ని వసతులు కల్పించి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. పక్కా ప్రణాళికతో పనులు చేపడుతున్నాం.
-క్రిష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా