సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) , జూలై 30: జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో నీరు నిలుస్తున్నది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండే చోట దోమలు, సూక్ష్మ క్రిములు వృద్ధి చెంది వ్యాధులకు కారకాలుగా మారుతున్నాయి. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యాధులు ముప్పు తెస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు వచ్చే కాలమిది. అపరిశుభ్ర వాతావరణంతో, దోమల వల్ల వ్యాపించే విష జ్వరాలు, నీటి కాలుష్యం వల్ల సంభవించే డయేరియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
డయేరియా.. : కలుషిత నీరు, నిల్వ ఆహారం ద్వారా అతిసార వస్తుంది. రోగికి ఒక రోజులో 10 నుంచి 15 సార్లు నీళ్ల విరేచనాలు అవుతాయి. వాంతులు కూడా ఎక్కువగా అవుతాయి. రోజులో నాలుగు నుంచి ఐదు సార్లు విరేచనాలు అయితే డయేరియా గుర్తించాలి. నీరు, ఆహారం ద్వారా వచ్చే వ్యాధి కావడంతో కుటుంబ సభ్యులు అందరూ ఆ ప్రాంతంలోని ప్రజలు ఒకేసారి అనారోగ్యానికి గురవుతారు. ఈ వ్యాధి ప్రభావం చిన్నారులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై ఎక్కువగా ఉంటుంది.
వైరల్ జ్వరం మాదిరి అకస్మాతుగా జ్వరం వస్తుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో ఎముకల విరిగేటంత నొప్పి కలిగిస్తుంది. ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం కలగడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం, వీపు ఉదర భాగాల చర్మంపై ఎర్రగా కందినట్టు చిన్న చిన్న మొటిముల కనిపిస్తాయి. ఒక్కో సారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా ఉంటుంది. ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. దోమ పగటి పూట కుడుతుంది. దోమ కుట్టినప్పుడు ఒళ్లంతా దద్దర్లు కనిపిస్తాయి. ఇళ్లలోని కుండీలు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, ఎయిర్ కూలర్లు, ఇండ్ల పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ కప్పులు, పగిలిన సీసాలు, టైర్లు వంటి వాటిలో చేరిన వర్షపు నీటిలో గుడ్లు పెట్టి ఈడిస్ దోమలు వృద్ధిచెందుతాయి.
ఇంటి పరిసర ప్రాంతాల్లో వృథా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పెంటకుప్పలు, చెత్తా చెదారం ఇంటికి దూరంగా వేయాలి. ఇంటిలోని అన్ని గదుల్లో దోమల మందుతో పిచికారీ చేయాలి. దోమ తెరలు వాడడం శ్రేయస్కారం. వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. ఇంటి పరిసరాల్లో పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పూల కుండీల్లో నీటిని తరచూ మారుస్తూ ఉండాలి. కుళాయిల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాలి.
వర్షంలో తడిస్తే ముందుగా వచ్చేది జలుబు. దీంతో జ్వరం, దగ్గు కూడా కామన్‌గానే వచ్చేస్తుంది. జలుబు అంటువ్యాధి కూడా. శరీరంలో తగినంత వ్యాధి నిరోధక శక్తి లేకపోవడంతో కొంత మంది వర్షంలో తడిసినా, తడవకున్నా సరే జలుబు వస్తూనే ఉంటుంది. అది తగ్గడానికి కూడా చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో వస్తే మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. సమీపంలోని ఆరోగ్య కేంద్రాలు, దవాఖానలకు వెళ్లి వైద్యాధికారులను సంప్రదించి, చికిత్స పొందాలి.
వర్షాకాలంలో దోమకాటు ద్వారా వచ్చే వ్యాధుల్లో మలేరియా ఒకటి. ఈ జ్వరానికి కారణం ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి. రోగి శరీరంలో ఈ సూక్ష్మజీవులుంటాయి. ఎనాఫిలిస్ జాతికి చెందిన ఆడ దోమ రోగిని కుట్టి రక్తంతో పాటు సూక్ష్మ జీవులను కూడా పీల్చుకుంటుంది. ఆ దోమ ఆరోగ్యవంతులను మళ్లీ కుట్టినప్పుడు వారికి సంక్రమిస్తుంది. వారికి 10 నుంచి 15 రోజుల తర్వాత జ్వరం వస్తుంది. సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే దీని ప్రభావం లివర్, కిడ్నీ, రక్తనాళాలు, మెదడుపై పడుతుంది. దోమకుట్టిన 10 నుంచి 14 రోజుల్లో మలేరియా లక్షణాలు బయటపడుతాయి. రోజు విడిచి రోజు జ్వరం రావడం, తలనొప్పి, ఒంటి నొప్పులు, చలి ఎక్కువగా ఉంటుంది. చెమటలు పట్టడం, కొన్ని సార్లు వాంతులు అవుతాయి. మలేరియా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
చికున్ గున్యా జ్వరం దోమ కాటు వల్ల వస్తుంది. తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు చికున్ గున్యా లక్షణాలు, చికెన్‌గున్యా సోకితే మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తిం చెందే అవకాశం ఉన్నది. ఇంటి ఎదుట వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యాధులు ముప్పు తెస్తాయి. మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు వచ్చే కాలమిది. అపరిశుభ్ర వాతావరణంతో, దోమల వల్ల వ్యాపించే విష జ్వరాలు, నీటి కాలుష్యం వల్ల సంభవించే డయేరియా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేతులు తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. మంచినీళ్లు కాచి చల్లార్చి తాగాలి.
– డాక్టర్ గణపతిరావు
జపనీస్ బీవైరస్ అనే సూక్మ జీవి దోమల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. పందులు, పశువులు, పక్షుల్లో ఈ వైరస్‌కు స్థావరాలుంటాయి. వీటిని కుట్టిన దోమలు మనిషికి కుడితే వ్యాప్తి చెందుతుంది. ఏడాది నుంచి 14 ఏండ్ల వయస్సు గల పిల్లల్లో ఎక్కవ వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకడం వల్ల మూడో వంతు మంది ప్రాణాలు కోల్పోతారు. పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, బుద్ధి మాంధ్యం, వినికిడి లోపాలు, దృష్టిలోపాలు వంటి అంగవైకల్యాలతో జీవితాంతం బాధపడుతుంటారు. వెంటనే వైద్యాధికారులను సంప్రదించి చికిత్స చేయించుకోవడం మంచిది.