కడ్తాల్, జూలై 30: మహిళలు స్వయం సహాయ సంఘాల ద్వారా అందజేస్తున్న బ్యాంక్ రుణాలను పొంది ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని డీఆర్డీవో ఏపీడీ జంగారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డీఆర్డీఏ-సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన, మండల మహిళా పరస్పర సహాయక సహకార పొదుపు సంఘం సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఆర్డీవో ఏపీడీ జంగారెడ్డి మాట్లాడుతూ మహిళా సమాఖ్య సభ్యులు బ్యాంక్ రుణాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో కడ్తాల్ మండల మహిళా సమాఖ్య అన్ని విభాగాల్లో అగ్ర స్థానంలో నిలిచి, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు గెలుచుకున్నదని పేర్కొన్నారు. గతేడాది బ్యాంక్ లింకేజీలో కడ్తాల్ మండల మహిళా సమాఖ్య వంద శాతం అచీవ్మెంట్ను సాధించిందన్నారు.
మండలంలో స్త్రీ నిధిలో సంఘాల నుంచి లోన్ రికవరీ చేయించి ఎన్పీఏ తగ్గించడం జరిగిందని చెప్పారు. మండల మహిళా సమాఖ్యను జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిపిన ఏపీఎం రాజేశ్వరిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఏపీఎం రాజేశ్వరి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జంగమ్మ, సీబీవో కృష్ణ, సీసీలు నర్సింహ, రాములు, జరీనా, వసంత, మల్లేశ్, అకౌటెంట్ విజేందర్, వీవోఏలు పాల్గొన్నారు.