పరిగి, జూలై 30 : ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గత నెలతో పోలిస్తే ఈ నెలలో భూగర్భ జలమట్టం మరింత పెరగడం గమనార్హం. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జల శాఖ అధికారులు 39 ప్రాంతాల్లో భూగర్భ జల మట్టం సేకరించడం జరిగింది. ఈ నెల 21వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా భూగర్భ జల శాఖ అధికారులు సేకరించిన సమాచారం మేరకు నెలతో పోలిస్తే 4.11 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగాయి. జిల్లా పరిధిలో జూన్ నెలలో సరాసరి భూగర్భ జలమట్టం 11.74 మీటర్లు ఉండగా జూలైలో 7.63 మీటర్లకు పెరిగింది.
తద్వారా గత నెలతో పోలిస్తే భూగర్భ జలాలు మరింత పెరిగాయి. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా యాలాల మండలం యెన్కెపల్లిలో 0.40 మీటర్లు(మీటరు కంటే తక్కువ) లోతులోనే భూగర్భ జలాలు ఉండడం గమనార్హం. ఈ ప్రాంతంలో మీటరు లోతు లోపే భూగర్భ జటమట్టం నమోదైంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 2 మీటర్ల లోపు భూగర్భ జలమట్టం నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు భూగర్భ జలమట్టం పరిశీలించగా, ఆ తర్వాత సైతం జిల్లాలోని అనేక చోట్ల భారీ వర్షాలు కురిసాయి. దీంతో అనేక చెరువులు అలుగులు పారుతున్నాయి. వాగులు వరద నీటితో ప్రవహించడం కొనసాగుతున్నది. తద్వారా వచ్చే నెలలో భూగర్భ జలమట్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల పరిధిలో మొత్తం 39 ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం సేకరించారు. మర్పల్లిలో 14.90 మీటర్లు ఉండగా గత నెలతో పోలిస్తే 8.08 మీటర్ల పెంపు, మోమిన్‌పేట్‌లో 2.97 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 4.89 మీటర్లు పెంపు, నవాబుపేట్‌లో 5.45మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 3.11 మీటర్లు పెంపు, వికారాబాద్‌లో 12.38 మీటర్లుండగా గత నెలతో పోలీస్తే 13.65 మీటర్లు పెంపు, ధారూర్‌లో 10.71 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 3.57 మీటర్లు పెంపు, బంట్వారంలో 2.27 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 7.07 మీటర్లు పెంపు, దోమలో 9.48 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 3.89 మీటర్లు పెంపు, కులకచర్లలో 11.17 మీటర్లుండగా.. గత నెలతో పోలిస్తే 3.62 మీటర్లు పెంపు, పరిగిలో 14.20 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 0.67 మీటర్లు పెంపు, పూడూరులో 5.43 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 2.39 మీటర్లు పెంపు, బొంరాస్‌పేట్‌లో 7.41 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 4.4 మీటర్లు, పెద్దేముల్లో 6.96 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 3.08 మీటర్లు పెంపు, తాండూరులో 3.61 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 3.54 మీటర్లు పెంపు, బషీరాబాద్‌లో 7.95 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 2.55 మీటర్లు పెంపు, యాలాల్లో 6.04 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 1.84 మీటర్లు పెంపు, కొడంగల్‌లో 7.29 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 4.45 మీటర్లు పెంపు, దౌల్తాబాద్‌లో 4.60 మీటర్లుండగా గత నెలతో పోలిస్తే 4.77 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి.
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా జూలై నెల ప్రారంభం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలోని అనేక మండలాల్లో భూగర్భ జలమట్టం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 39 ప్రాంతాల్లో భూగర్భ జల మట్టం పరిశీలించాం. జూన్ నెలతో పోలిస్తే జూలై నెలలో జిల్లాలో సరాసరి 7.63 మీటర్లు భూగర్భ జలమట్టం పెరిగింది. భూగర్భ జలమట్టం పరిశీలన తర్వాత మళ్లీ వర్షాలు కురియడంతో మరింత పెరిగే అవకాశం ఉన్నది.
– జి.దీపారెడ్డి, వికారాబాద్ జిల్లా భూగర్భ జల అధికారి