కడ్తాల్, జూలై 30 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలపడానికి సీఎం కేసీఆర్ నిరంతరం కష్టపడుతున్నారని అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీజేపీ నాయకులు వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో అలజడి సృష్టించడానికి బీజేపీ నాయకులు మహాసభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. ఆమనగల్లు అభివృద్ధిని అడ్డుకుంటున్నది, ఆటంకాలు సృష్టిస్తున్నది ఎవరో నియోజకవర్గంలోని ప్రజలకు తెలుసని అన్నారు. అనంతరం మండలంలోని 15 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్ కోర్సులకి సంబంధించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, డీటీ రాజశేఖర్, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, శంకర్, భాగ్యమ్మ, సులోచన, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, మంజుల, ప్రియ తదితరులు పాల్గొన్నారు.