ఇబ్రహీంపట్నం, జూలై 30 : మిషన్‌భగీరథ పైపులైన్ల ఏర్పాటుతో మున్సిపాలిటీల్లో ధ్వంసమైన రోడ్ల మరమ్మతుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మిషన్‌భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రధాన రోడ్లను తవ్వారు. ఈ రోడ్ల మరమ్మతుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో మిషన్‌భగీరథ పథకం ద్వారా పైపులైన్ల మరమ్మత్తులతో పాటు సీసీరోడ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఈ నిధులతో అన్ని మున్సిపాలిటీల్లోని వార్డుల్లో రోడ్లను తిరిగి పునరుద్దరించి పైపులైన్లు వేయకముందు ఉన్న మాదిరిగానే తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. దీంతో గుంతల మయంగా మారిన రోడ్లను మరమ్మతు చేసే పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు నిమగ్నమయ్యారు.
జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో ధ్వంసమైన రోడ్ల మరమ్మతు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించించింది. ప్రతి మున్సిపాలిటీకి రూ.4 నుంచి రూ.5కోట్ల నిధులు కేటాయించి రోడ్లను మరమ్మతులు చేపడుతున్నది. జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో ధ్వంసమైన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మిషన్‌భగీరథ పైపులైన్ మరమ్మతు పనుల్లో భాగంగా ధ్వంసమైన రోడ్లను మరమ్మత్తు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.7.30కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులతో ఇబ్రహీంపట్నంలోని తాసీల్దార్ కార్యాలయం నుంచి పాత పోలీసుస్టేషన్, పాత బస్టాండు నుంచి స్టేట్‌బ్యాంకు, రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి మంచాల రోడ్డు, పాత పోలీస్‌స్టేషన్ నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయం, సాగర్ప్రధాన రహదారి నుంచి బృందావన్ కాలనీలకు వెళ్లే ప్రధాన రోడ్లను మరమ్మతు చేసేందుకు నిధులు కేటాయించినందున ఇప్పటికే మరమ్మతు పనులు ప్రారంభమై ధ్వంసమైన రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతున్నారు.
ప్రభుత్వం మిషన్‌భగీరథ పథకం కింద పైపులైన్లు వేయటం ద్వారా ప్రధాన రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఈ రోడ్ల మరమ్మతులకు ప్రత్యేకంగా ప్రతి మున్సిపాలిటీకీ నిధులు కేటాయించి పనులు చేపడుతున్నాం. ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీల్లో పాడైపోయిన ప్రతి రోడ్డుకూ మరమ్మతు చేపట్టేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాం. ఈ నిధులతో ధ్వంసమైన ప్రతిరోడ్డునూ అద్దంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే