పెద్దఅంబర్‌పేట, జూలై 30 : సెప్టిక్ ట్యాంక్‌పై మూత సగం విరిగిపోయింది. ‘చేపిద్దాంలే’ అని చేసిన చిన్న నిర్లక్ష్యం ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. నాలుగేండ్ల చిన్నారి అందులో పడి ప్రాణాలు వదిలింది.. ఈ ఘటన నగరంలోని కుషాయిగూడలోని మహేశ్‌నగర్‌లో చోటుచేసుకున్నది.
అకస్మాత్తుగా పరుగున వచ్చిన మూడేండ్ల పసిపాప ఆ కారు వెనుక టైర్ల కింద పడి ప్రాణాలు వదిలింది.
ఒక్కటి కాదు.. రెండు కాదు. చిన్నపాటి అజాగ్రత్తలు చిన్నారుల ఉసురుతీస్తున్నాయి. తెలిసో తెలియకో చేస్తున్న పొరపాట్లు పసివాళ్ల ప్రాణాలు బలిగొంటున్నాయి. కన్నోళ్లకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. ‘అయ్యో బిడ్డా.. ఇంత పనయితదని అనుకోలే’ అంటూ పశ్చాత్తాపాన్ని నింపుతున్నాయి. బోర్లా పడుతూ పాకే తొమ్మిది నెలల పసి పాప నుంచి ఐదారేండ్లలోపు పిల్లల వరకు నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. అసలు ఊహించనివిధంగా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలను నిత్యం శ్రద్ధగా చూసుకుంటున్నప్పటికీ.. ఈ తరహా ప్రమాదాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
పిల్లలను బండిపై తీసుకెళ్లే సమయంలో తల్లిదండ్రులు, సంరక్షకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలపై వెళ్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. స్కూటీ, యాక్టీవాలపై చిన్న పిల్లలను ముందు నిలబెట్టే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఐదేండ్లలోపు పిల్లలు నిలబడి త్వరగా నిద్రలోకి జారిపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు.. పిల్లలు బండి ఎక్స్‌లేటర్‌పై చేయి పెట్టకుండా చూడాలి. పదే పదే పిల్లలకు ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. అలా చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని చెప్తుండాలి. బయలుదేరేటప్పుడు లేదా బండి స్టార్ట్ చేసి ఉండగా ఆగి పక్కవారితో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు వారికి తెలియకుండా కూడా ఎక్స్‌లేటర్‌పై చేయి వేసే అవకాశం ఉంటుంది.