సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలతో పాటు మెరుగైన వైద్యం అందుతున్నది. ‘కేసీఆర్ కిట్’ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ దవాఖానలకు గర్భిణులు క్యూ కడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 35,509 మందికి కేసీఆర్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.
అంతేకాకుండా అమ్మఒడిలో భాగంగా రూ.64.39 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేసింది. జిల్లాలో సుమారు నెలకు 2 వేల వరకు డెలివరీలు అవుతుండగా, గడిచిన ఆరేండ్లలో 45,484 ప్రసవాలు అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరుగడంతో ప్రైవేటు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య తగ్గిందని అధికారులు వివరిస్తున్నారు.
రంగారెడ్డి, జూలై 30 (నమస్తే తెలంగాణ): సర్కార్ దవాఖానలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రత్యేక దృష్టి సారించడంతో మెరుగైన వైద్యంతోపాటు సకల సదుపాయాలు ప్రభుత్వ దవాఖానల్లో కల్పిస్తున్నారు. మెరుగైన వైద్యంతోపాటు ప్రసవాల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన కేసీఆర్ కిట్ పథకంతో దవాఖానలకు గర్భిణులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్, అమ్మవడి పథకాలతో గతంలో ఎన్నడూలేని విధంగా సర్కార్ దవాఖానలపై వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవమైతే 15 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌తోపాటు అమ్మవడి పథకంలో భాగంగా నగదు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందజేస్తున్నది. అంతేకాకుండా కార్పొరేట్ దవాఖాన స్థాయిలో వైద్యాన్ని అందిస్తుండడంతో సాధారణ వైద్యం నిమిత్తం వచ్చే ప్రజలు రోజురోజుకూ పెరుగుతున్నారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆరేండ్లలో అర్హులైన 35,509 మందికి కేసీఆర్ కిట్స్‌ను పంపిణీ చేయగా, అమ్మఒడిలో భాగంగా 64.39 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది.
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 35,509 కేసీఆర్ కిట్స్‌ను లబ్ధిదారులకు అందజేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 5269 కిట్స్, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6281, 2019-20లో 5879, 2020-21లో 7110, 2021-22లో 7313, 2022-23 సంవత్సరంలో ఇప్పటివరకు 2444 కేసీఆర్ కిట్స్‌ను పంపిణీ చేశారు. గతంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో నెలకు 300 ప్రసవాలు జరుగగా,…కేసీఆర్ కిట్స్ పథకాన్ని అమలు చేస్తున్నప్పటి నుంచి జిల్లాలోని దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 2వేల వరకు పెరిగినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో అత్యధికంగా వనస్థలిపురంలోని ఏరియా దవాఖానలో నెలకు 250-300 ప్రసవాలు, కొండాపూర్‌లోని జిల్లా దవాఖానలో 200-250 ప్రసవాలు, షాద్‌నగర్ దవాఖానలో 150-200 ప్రసవాలు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో నెలకు 100 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8328 ప్రసవాలు జరుగగా, 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను 9118 ప్రసవాలు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8198 ప్రసవాలు, 2020-21లో 9815 ప్రసవాలు, 2021-22లో 10,025 ప్రసవాలు జరిగాయి.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యంతోపాటు మౌలిక సదుపాయాల నిమిత్తం సర్కార్ దవాఖానలకు రూ.కోట్లు ఖర్చు పెడుతూ.., కేసీఆర్ కిట్, అమ్మవడి పథకాలతో ప్రజలకు దవాఖానలపై నమ్మకం పెరిగింది. మొదటి విడతలో భాగంగా దవాఖానలో గర్భిణీగా నమోదు చేసుకోవడంతోపాటు వైద్య పరీక్షలు, టీటీ ఇంజక్షన్, ఐరన్ మాత్రలు తీసుకున్నట్లయితే రూ.3వేలు, రెండో విడుతలో భాగంగా ప్రసవం అయిన వెంటనే రూ.4వేలు, ఆడపిల్ల పుట్టినట్లయితే రూ.5వేలు సాయాన్ని అందజేస్తున్నారు.
అదేవిధంగా మూడో విడుతలో భాగంగా పిల్లలకు పెంటావాటెంట్ మూడవ రోజు అందిన వెంటనే రూ.2 వేలు, నాలుగవ విడతలో భాగంగా పిల్లలకు సంపూర్ణ వ్యాధి నిరోధక టీకాలు వేయించిన తర్వాత రూ.3వేల నగదు ప్రోత్సాహాకాన్ని గర్భిణులకు అందజేస్తున్నారు. దీంతో సర్కార్ దవాఖానలకే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.