పరిగి, జూలై 26: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టరేట్లోని క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయని.. ప్రమాదకరమైన దశలో ప్రవహిస్తు న్న చెరువులు, వాగుల వద్దకు ప్రజలు వెళ్లొద్దని గ్రామాల్లో దండోరా వేయించాలని ఎంపీడీవోలకు సూచించారు.
నీటి పారుదల శాఖ సిబ్బం ది, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలను వెం టనే ప్రమాద స్థలాల వద్ద నియమించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గుర్తించిన 52 ప్రమాద స్థలాలను బ్లాక్ చేయించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లో నివసిస్తున్న వారిని వెం టనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
వికారాబాద్‌లోని రామయ్యగూడలో ఉన్న నివాసాల్లోకి వచ్చిన నీటిని వెంటనే తొలగించాలని, మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు వా ర్డుల్లో విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని..వర్షాలు మరో రెండు రోజులపాటు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా అన్ని మండలాల్లోని పరిస్థితిని కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రమాదకరంగా గుర్తించిన 52 స్థలాల వద్ద పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్-తాండూరు ప్రధాన రహదారిలో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించినట్లు.. నవాబుపేట, మోమిన్‌పేట వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలు రాకుం డా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
కార్యక్రమంలో ఆర్డీవోలు, నీటి పారుదల శాఖ, ఆర్అండ్బీ ఈఈలు, మండలాల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవో లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొ న్నారు. మంగళవారం ఉదయం కలెక్టర్ జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షా లు కురుస్తున్న నేపథ్యంలో చెరువుల్లోకి జాలర్లు, ప్రజలను అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు. ఎబ్బనూరు చెరువు వద్ద రోడ్డుకు అతి సమీపంలో పెద్ద మొత్తంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో గ్రామానికి వెళ్లే రహదారి దెబ్బతినే అవకాశం ఉన్నందున చెరువు నుంచి నీరు అధికంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం జిల్లాలోని అన్ని స్కూళ్లు, విద్యాసంస్థలకు వికారాబాద్ కలెక్టర్ నిఖిల సెలవు ప్రకటించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల దృష్ట్యా జూనియర్ కళాశా లలకు మినహాయింపు ఇచ్చారు.