ఇబ్రహీంపట్నం, జూలై 26: ప్రభుత్వం, బ్యాంకులు అందజేస్తున్న ప్రమాద బీమా పథకాల్లో ప్రతి ఒక్కరూ చేరాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తులేకలాన్ గ్రామానికి చెందిన కోడూరి భాష రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.20 లక్షల ప్రమాద బీమా చెక్కును బాష భార్య మౌనికకు కిషన్రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాలు చెప్పి రావని, బీమా చేయించుకుంటే ఆపత్కాలంలో కుటుంబానికి కొండంత అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న రైతు బీమా, కార్మిక బీమా తదితర పథకాలతోపాటు బ్యాంకులు ఖాతాదారులకు అందజేస్తున్న బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బ్యాంకు రీజినల్ మేనేజర్ సుశాంక్కుమార్ మాట్లాడుతూ.. ఎస్బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు జనరల్ ఇన్సూరెన్స్ పథకంలో సంవత్సరానికి రూ.500 చెల్లిస్తే 10 లక్షలు, వెయ్యి చెల్లిస్తే రూ.20 లక్షల బీమా వర్తిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, బ్యాంకు అధికారులు కేవీ ప్రసాద్, రమేశ్, బ్రాంచ్ మేనేజర్ డేవిడ్ మోహన్రాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గ రాములు, సర్పంచ్ యాదగిరి, వార్డు సభ్యుడు అచ్చన కృష్ణ, గ్రామశాఖ అధ్యక్షుడు గుజ్జ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.