వికారాబాద్, జూలై 26: వికారాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఆలంపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద వాగు పారుతున్నది. ధన్నారం వెళ్లే ప్రధాన రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. రాజీవ్ గృహకల్పలోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. గంగారం కాలనీ లో పలు ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మండల పరిధిలోని పీరంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుపై నుంచి వరద నీరు పారడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మద్గుట్ చిట్టంపల్లిలోని బస్తీ దవాఖానలోకి వర్షపు నీరు చేరింది. శివసాగర్ చెరువు, సర్పన్‌పల్లి ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు చేరడంతో అలుగు పారుతున్నది. మద్గుల్‌చిట్టంపల్లి వాగు, ధన్నారం తదితర వాగులను వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పరిశీలించారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజుల వరద నీటితో ఇబ్బం దులు పడుతున్న ప్రజలతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.
తాండూరు, జూలై 26: తాండూరు నియోజకవర్గంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి కురిసిన కుండపోత వర్షంతో నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరా బాద్, పెద్దేముల్ మండలంలోని వాగులు, చెరువులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల పంటపొలాల్లోకి వరదనీళ్లు చేరడంతో పంటలు పూర్తిగా మునిగి పోయాయి. కోకట్, గాజీపూర్ వాగులు రోడ్డుపైనుంచి పారడంతో తాండూరు- ముద్దాయిపేట్, తాండూరు-పెద్దేముల్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కందనెల్లి, మన్ సాన్‌పల్లి, తాండూరు-చించొల్లి మార్గంలో వాగులు పొంగిపొర్లి రాకపోకలు నిలిచి పోవడంతో పాటు పంటపొలాల్లో వరదనీళ్లు నిండిపోయాయి. కాగ్నానది, కాక్రావేణి నదులు పొంగి పొర్లడంతో నియోజకవర్గం ప్రజలు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. శివ సాగర్, జుం టుపల్లి ప్రాజెక్టులు నిడి అలుగులు పారుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతి నిధులు, అధికారు లు నీటమునిగిన గ్రామాలను, కాలనీలను పరిశీలించారు.
ధారూరు, జూలై 26: ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టు, మున్నూర్ సోమారం చెరువు, ఎబ్బనూర్ చెరువు, మైలారం చెరువు పొంగిపొర్లుతున్నాయి. మండల పరిధిలోని నర్సాపూర్, కొండాపూర్‌కలాన్, మైలారం, నాగారం, రాజాపూర్, మోమిన్ ఖుర్దు, మోమిన్‌కలాన్, తరిగోపుల తదితర గ్రామాల్లో పంటపొలాలు నీట మునిగాయి. దోర్నాల్-ధారూరు స్టేషన్ (కాగ్నా)వాగు పొంగి పోర్లుతుంది. నాగసముందర్-రుద్రారం గ్రామాల మధ్యగల వంతెనపై భారీగా వరద నీరు ప్రవహిస్తున్నది. మైలారం- నాగారం గ్రామాల మధ్యగల వాగు పూర్తిగా నిండి వంతెనపై నుంచి నీరు భారీగా ప్రవహిస్తున్నది.
పరిగి టౌన్, జూలై 26: మండల పరిధిలోని పలు గ్రామాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పరిగి నుంచి నస్కల్ వెళ్లే దారిలో నస్కల్ వాగు పొంగిపొర్లడంతో రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. స్థానిక ఎస్సై విఠల్‌రెడ్డి వాగుదగ్గరకు తన సిబ్బందితో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. వాగుపై పేరుకుపోయిన ముళ్ళపొదలను తీయించారు. వరద ప్రవాహం వాగు కిందినుండి వెళ్లడంతో రాకపోకలు కొనసాగాయి
పూడూరు, జూలై 26: కడ్మూర్ గ్రామ సమీపంలో ఈసీ వాగు పరవళ్లు తొక్కుతున్నది. గ్రామానికి చెందిన ఓ రైతుల పొలం వద్దనే సోమవారం రాత్రి ఎడ్లను కట్టేసి ఇంటికి వచ్చాడు. భారీ వర్షానికి ఈసీ వాగు నిండి నీరు రావడంతో వాగులోనే చిక్కుకున్నాయి. తాడు సహాయంతో కానిస్టేబుల్స్ రఫీక్, మల్లేశం రెండు ఎడ్లను కాపాడారు. మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న బ్రిడ్జి కూలి ప్రమాదకరంగా మారడంతో మండల కేంద్రానికి వచ్చే వారిని గొంగుపల్లి మార్గం నుంచి స్థానికులు పంపించారు.
పెద్దేముల్,జులై 26 : మండలంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. 43.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆయా గ్రామాల్లోని వాగులు, వంకలు, కుంటలు పొంగి పొర్లాయి. పొలాల్లో వరదనీరు వచ్చి చేరింది. తాండూరు-సంగారెడ్డి ప్రధాన రోడ్డు మార్గంలో గాజీపూర్ వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
మర్పల్లి, జూలై 26 : సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికీ మండలంలోని సిరిపురం వాగు ఉధృతంగా ప్రవహించి రాకపోకలు స్తంభిం చి పోయాయి. వరదనీటితో పంటలు మునిగి పోయాయి. ఏవో వసంత పంట పొలాలను పరిశీలించారు. పొలాల్లో ఉన్న నీటిని కాలువ ద్వారా మళ్లించాలని రైతులకు సూచించారు.
దోమ, జూలై26: మండలంలో గోడుగోనిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. రాకొండ ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి వర్షం నీరు వచ్చి చేరడంతో ఉపాధ్యాయులు, విద్యా ర్థులు ఇబ్బందులు పడ్డారు. తిమ్మాయిపల్లి గ్రామం నుంచి రాకొండకు వెళ్లే దారిలో రైతుల పంట పొలాలు నీట మునిగాయి. దోమ మండలానికి చెందిన చిల్కమూరి అనంతయ్య వరి పంట నీట మునిగింది. దోమ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
బషీరాబాద్, జూలై 26 : మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీనికి తోడు ఎగువన కురిసిన వర్షానికి కాగ్నా నది పరవళ్లు తొక్కింది. జీవన్గి గ్రామంలో మహాదేవ లింగేశ్వరుడికి జలాభిషేకం చేసింది. గ్రామంలో పలు ఇండ్లలోకి వరదనీరు రావడంతో అధికారులు వారిని ఖాళీ చేయించారు.
బొంరాస్‌పేట, జూలై 26 : మండలంలో సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. 33.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షానికి మండ లంలోని వాగులు పారుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరదనీరు వచ్చి చేరుతుంది.
కోట్‌పల్లి, జూలై 26: సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురు స్తున్నది. దీంతో వాగులు, కాల్వలు ఉధృతంగా పారుతున్నాయి. పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలన్నీ నీట మునిగాయి.
కులకచర్ల, జూలై 26 : కులకచర్ల మండల పరిధిలో కురిసిన భారీ వర్షానికి కాల్వల నుంచి నీళ్లు పెద్ద ఎత్తున రావడంతో ముజాహిద్పూర్ దాస్యనాయక్తండాలో అక్కమ్మ చెరువు వాగు ఉధృతంగా పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండల పరిధిలోని అంతారం గ్రామంలోని ప్రాథమి కోన్నత పాఠశాలలోకి నీళ్లు చేరడంతో పాఠశాల ఆవరణ మొత్తం నీటిమయంగా మారింది.
బంట్వారం, జులై 26: మడంలంలోని సల్బత్తాపూర్ వద్ద ఉన్న రోడ్డు పూర్తిగా తెగి పో యింది. మండల కేంద్రం నుంచి తాండూరు, వికారాబాద్ రాకపోకలు నిలిచి పోయా యి. నూరుళ్ళపూర్ వాగు పొంగి ప్రవహించడం వల్ల రాకపోకలు స్తంభించిపోయాయి. మాలసోమారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోకి వరద నీరు చేరి బురదమయమైంది. దీంతో సర్పంచ్ నర్సింహారెడ్డి పాఠశాలను సందర్శించారు.