రంగారెడ్డి, జూన్ 21, (నమస్తే తెలంగాణ) : జిల్లాకు మంజూరైన బస్తీ దవాఖానలను త్వరితగతిన ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం బషీర్బాగ్లోని తన కార్యాలయంలో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ ఈ వైద్యశాలలకు రూపకల్పన చేశారన్నారు.
జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో 10, రాజేంద్రనగర్లో 7, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 5 బస్తీ దవాఖానలను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి వెల్లడించారు. పలు వైద్యశాలల భవనాల గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందని, మిగతావాటికి సంబంధించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలతోపాటు మందులు, టీకాలు ఉచితంగా అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రజలు రోగాల బారిన పడితే ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వాటిని అరికట్టడంలో ఈ దవాఖానలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్లాల్, జల్పల్లి మున్సిపల్ చైర్మన్ సాధిక్, తుక్కుగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.