జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సూచించారు. మంగళవారం జడ్పీచైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి అధ్యక్షతన జరిగిన జడ్పీ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
సీజనల్ వ్యాధులు, బూస్టర్ డోస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 15 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించిన దృష్ట్యా త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రూ.200 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నామని, మొదటి విడుతలో 464 స్కూళ్లలో రూ.90 కోట్ల నిధులతో పనులు చేపట్టామన్నారు. వచ్చే ఏడాది నుంచి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగానే విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను అందజేస్తామన్నారు.
రంగారెడ్డి, జూలై 26, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వ్యవసాయ, వైద్యారోగ్య, విద్యాశాఖలపై జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని, ప్రతి ఆదివారం ఉదయం 10.10 గంటలకు మన ఇండ్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతోపాటు చెత్తాచెదారాన్ని తొలగించేలా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు బూస్టర్ డోస్‌పై అవగాహన కల్పించాలని, ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా లో ఇంటింటికీ సర్వే నిర్వహించి బీపీ, షుగర్ ఉన్నవారికి నేరుగా ఇంటి వద్దనే ప్రభుత్వం ఉచితంగా మందులను అందజేస్తుందన్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రూ.200 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నామని మంత్రి పేర్కొన్నారు. మొదటి విడుతలో ఈ విద్యాసంవత్సరంలో 464 స్కూళ్లలో రూ.90కోట్ల నిధులతో పనులు చేపట్టామన్నారు.
మన ఊరు-మన బడిలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో ఒక గ్రంథాలయాన్ని, స్కూళ్లలో సోలార్ ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి పాఠశాలలో ప్రత్యేకంగా స్కావెంజర్స్‌ను కూడా నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టెండర్ల ప్రక్రియ ఆలస్యంతో ప్రభుత్వ స్కూళ్లకు పుస్తకాల పంపిణీ కొంత జాప్యం జరిగిందని, ఇప్పటివరకు జిల్లాలో 90 శాతం మేర పుస్తకాలను చేరవేశారన్నారు.
జూన్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా రెండు భాషల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి ముందుగానే విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను అందజేస్తామన్నారు. కేజీబీవీల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించేలా పనులు చేపట్టాలని ఆదేశించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం విడుతలవారీగా రుణమాఫీ ప్రక్రియను చేపట్టగా తలకొండపల్లి జడ్పీటీసీ వెంకటేశం రుణమాఫీ పథకంపై అవగాహన లేకుండా రాద్దాంతం చేశారు. ఇప్పటివరకు రూ.50 వేల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తికాగా, రూ.75 వేల రుణమాఫీ ప్రక్రియను చేపట్టారు. రూ.లక్ష వరకు రుణాలున్న వారిలో ఇప్పటికీ ఒక్కరికీ రుణమాఫీ వర్తించలేదని అవగాహన లేకుండా సభలో మాట్లాడారు.
మిగతా సభ్యులు ఇంకా రూ.లక్ష రుణమాఫీ కాలేదని తెలిపినా.. పట్టించుకోకుండా వితండవాదం చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేరును ప్రస్తావించడంతో జడ్పీటీసీ వెంకటేశంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువని, సభా గౌరవాన్ని పాటించాలని, ఎమ్మెల్యేకు బాధ్యత లేదనడానికి నీవెవరంటూ జడ్పీటీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశం ప్రారంభమైన తరువాత పిరమిడ్ సృష్టికర్త సుభాష్ పత్రీజీ మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
త్వరలో 15 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆమోదం తెలిపారని, టెట్ పరీక్ష నిర్వహించిన దృష్ట్యా త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు చేపట్టామని మంత్రి అన్నారు. మండలానికి ఒక ఎంఈవో ఉండేలా నిర్ణయించామని, త్వరలోనే అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియను కూడా చేపట్టామని, జిల్లాలోని ఆయా స్కూళ్లలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి హేతుబద్ధీకరణ చేపడుతామన్నారు. హాజరు శాతానికి విద్యార్థుల సంఖ్యతో పొంతన లేకుండా ఉందని, ఒకసారి పరిశీలించి.. సరైన వివరాలను పొందుపర్చాలని పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ కనెక్షన్లను తొలగించినట్లు జడ్పీటీసీలు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గ కేంద్రంలో ఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు విన్నవించామన్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం ఒక్కో మండలం ఒక్కో నియోజకవర్గంలోని శాఖలకు చేర్చారని, కల్వకుర్తికి ప్రత్యేకంగా కోర్టు మంజూరు అయిన దృష్ట్యా మిగతా అన్ని శాఖలను కూడా నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసేలా చూడాలని ఏకగ్రీవ తీర్మానం చేయగా, సభ ఆమోదించింది.