గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అమలుచేస్తున్నది. మెదక్ జిల్లాలో 21 మండలాల్లోని 20 పీహెచ్‌సీల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇందుకోసం వైద్యులకు అవసరమైన శిక్షణను ఇచ్చారు. మొత్తం 53రకాల వ్యాధులకు చికిత్స అందించనుండగా, సాధారణ డాక్టర్లతో పాటు ఆయా రోగాలకు సంబంధించిన స్పెషలిస్టులను సర్కార్ కేటాయించనున్నది. ఏదైనా దవాఖానలో రోగికి చికిత్స లేకపోతే ఆరోగ్యశ్రీ యాప్‌లో రోగాన్ని నమోదు చేసి ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి తరలించి వైద్యం అందిస్తారు.
మెదక్, జూలై 2 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే కార్పొరేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందిస్తున్నది. ప్రస్తుతం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిస్థాయిలో విస్తృత పరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ నేతృత్వంలో ప్రతీ పీహెచ్సీలో ఆరోగ్యమిత్రల ద్వారా 53 రకాల వ్యాధులకు చికిత్సను అందుబాటులోకి తీసుకురానున్నారు. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి అమల్లోకి తీసుకువచ్చారు.
మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉండగా, 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులే కాకుండా స్పెషలిస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ డెలివరీలు చేస్తే డాక్టర్‌తో పాటు సిబ్బందికి రూ.3వేల ప్రోత్సాహం అందించనున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెయింటెనెన్స్‌లో కూడా సిబ్బందికి, పరికరాలు, ఇతర వైద్య అవసరాలను వెంటనే తీర్చుకునే వెసులుబాటును క ల్పించింది. ఇప్పటికే ప్రా థమిక ఆరోగ్య కేం ద్రాల్లో 24 గంటల పా టు ఆరోగ్య సేవలు అం దుతున్నాయి. ఈక్రమం లో జిల్లాలోని 20పీహెచ్‌సీల్లో జూన్ 2వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులు తప్పకుండా ఆరోగ్యశ్రీ కార్డును వెంటతెచ్చుకోవాలి. రోగికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో వైద్యుడు పరీక్షించి చికిత్సలు జరుపుతారు. ఒకవేళ అక్కడ వైద్య చికిత్సలు అందుబాటులో లేకుంటే ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా రోగి సమస్యను ఎంటర్ చేసి ఎక్కడ సరైన వైద్య చికిత్సలు ఉన్నాయో అప్రూవల్ పంపిస్తారు. అప్రూవల్ రాగానే సంబంధిత రోగిని దవాఖానకు తరలించి ఉచితంగా వైద్యం చేస్తారు.
ఆరోగ్యశ్రీ స్కీంలో 53 రకాల వ్యాధులకు చికిత్స అందించనున్నారు. ఇకపై పీహెచ్‌సీల్లోనే రిజిస్ట్రేషన్, అఫ్రూవల్స్ వంటివి జరుగనున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో స్వైన్‌ఫ్లూ, హెపటైటిస్, లివర్, మూత్ర సమస్యలు, న్యూమోనియా, కీళ్ల సమస్యలు, బీపీ, షుగర్, వడదెబ్బ, మలేరియా, డెంగీ, చికున్ గున్యా, డయేరియా తదితర వ్యాధులకు పీహెచ్సీ పరిధిలోనే ఆరోగ్య సేవలు అందించనున్నారు. జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, పాము, కుక్క కాటు, కార్డియాలజీ, పల్మనాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాలకు చెందిన సమస్యలకు కూడా ఆరోగ్యశ్రీ కింద నమోదు చేస్తారు.
జిల్లాలోని 20 పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయి. పీహెచ్‌సీలకు వచ్చే రోగులు తప్పకుండా ఆరోగ్యశ్రీ కార్డును వెంట తీసుకురావాలి. ఆరోగ్యశ్రీ పథకంలో 53 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్‌వో మెదక్