సంగారెడ్డి, జూన్ 2(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా పాలసీతో భారతదేశం ప్రపంచంలో అగ్రస్థాయికి చేరుకునేందుకు రోడ్‌మ్యాప్‌లా ఉపయోగపడుతున్నదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన పలు కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఐటీ హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్కు, రీసెర్చ్ సెంటర్ కాం ప్లెక్స్ భవనాలను ఆయన ప్రారంభించారు.
అనంతరం బీవీఆర్ మోహన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఐఐటీ హైదరాబాద్ ఆడిటోరియంలో కేంద్రమంత్రి ప్రధాన్ సమక్షంలో ‘ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), ఐఐటీ హైదరాబాద్ కలిసి పనిచేయాలన్న ఎంవోయూపై ఇఫ్లూ వీసీ సురేశ్‌కుమార్, ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి సంతకాలు చేశారు. గ్రీన్కో స్కూల్ ఆఫ్ సస్టెయినబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు కోసం గ్రీన్కో సంస్థ ప్రతినిధి అనిల్‌కుమార్, ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి ఎంవోయూపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ.. ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేసుకున్న ఐఐటీయన్లు కేవలం ఉద్యోగులుగా మిగిలిపోకుండా ఔ త్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ కీలకపాత్ర పోషించనున్నట్లు చెప్పారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఐఐటీలు భాగస్వామ్యం కీలకంగా ఉంటుందని తెలిపారు. ఉపాధి కల్పనపై ఐఐటీ హైదరాబాద్ దృష్టి పెట్టాలన్నారు.
పరిశ్రమలతో కలిసి ఐఐటీ హైదరాబాద్ ప్రపంచస్థాయి స్కిల్ సెంటర్‌ను ఏర్పా టు చేయాలని సూచించారు. పరిశోధనలు, ఆవిష్కరణలో ఐఐటీ హైదరాబాద్ ముం దంజలో ఉన్నట్లు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేయటంపై దృష్టి పెట్టాలన్నారు. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్‌లో టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్కు, రీసెర్చ్ సెంట ర్ కాంప్లెక్స్ ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందన్నారు. గ్రీన్‌కోతో కలిసి స్కూల్ ఆఫ్ సస్టెయినబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవటం సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ కొత్త ఆవిష్కరణల కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇఫ్లూతో ఒప్పందం కుదుర్చుకోవటం కీలక మలుపుగా అభివర్ణించారు. ఇఫ్లూ ఐఐటీ హైదరాబాద్‌లోని ఐఐటీయన్లకు మాండరీన్ సహా ఇతర విదేశీ భాషలు నేర్పించనున్నట్లు చెప్పారు. ఐఐటీ విద్యార్థులు తైవాన్, చైనా లాంటి దేశాల్లో పనిచేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇఫ్లూ వీసీ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి తాము పని చేయనుండటం సంతోషంగా ఉందన్నారు. ఐఐటీ హైదరాబాద్ బోర్డు ఆఫ్ గవర్నర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. సైయంట్ ఫౌం డేషన్, శిబోది ఫౌండేషన్ సంయుక్తంగా ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో బీవీఆర్ మోహన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఐఐటీ హైదరాబాద్‌లో అనేక కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఐఐటీయన్లను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్కో సంస్థ ప్రతినిధి అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్‌లో గ్రీన్కో సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్కో స్కూల్ ఆఫ్ సస్టెయినబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు చేయనుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న భూ వాతావరణ మార్పులతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
దేశంలో కూడా వాతావరణ మార్పుల ప్రభావం అన్ని రంగాలపై పడుతున్నట్లు చెప్పారు. దీనిని మార్చేందుకు గ్రీన్కో కృషి చేస్తున్నట్లు తెలిపారు. జైకా ప్రతినిధి సైటో మిత్సునోరి మాట్లాడుతూ.. భారతదేశం, జపా న్ అన్ని రంగాల్లో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఐఐటీ హైదరాబాద్‌లో కొత్తగా టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్కు, రీసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఐఐటీ హైదరాబాద్ దేశంలో కీలకమైన ఆవిష్కరణలకు కేం ద్రంగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.