క్రీడా ప్రాంగణం ఏర్పాటుఆ పల్లె అంతా పచ్చదనమే.. ఎటు చూసినా ఆకట్టుకునే మొక్కలు, చెట్లు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రకృతి వనాలు. తాగునీటి సమస్య లేకుండా ఇంటింటికీచేరుతున్న మిషన్ భగీరథ నీరు.., మురుగునీరు రోడ్లపై పారకుండా వాడవాడకూ డ్రైనేజీ నిర్మాణాలు, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణం.. ఇలా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మౌలిక వసతులు కల్పించుకుంటూ ప్రగతి వనంలా మారుతున్నది మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామం.
మునిపల్లి, జూలై 2: పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో బుసారెడ్డిపల్లి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. అందో ల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కృషితో బుసారెడ్డిపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రభుత్వం నుంచి గ్రామాలకు నిధులు భారీగా వస్తుండడంతో ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో సర్పంచ్ గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తూ మౌలిక వసతులను కల్పిస్తున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బుసారెడ్డిపల్లి గ్రామం పరిశుభ్రతకు మారుపేరుగా మారింది. నిత్యం గ్రామంలో చెత్తాచెదారం లేకుండా డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సహకారంతో సుమారు రూ.70 లక్షల అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలు చేపట్టారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మురుగునీరు రోడ్లపై పారకుండా డ్రైనేజీ నిర్మాణాలు జరుగుతున్నాయి. గ్రామంలో వాడవాడల్లో సీసీరోడ్లు దర్శనమిస్తున్నాయి. గ్రామస్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించి ఇంటింటికీ తాగునీరు అందజేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలతో వైకుంఠధామం నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తుండగా, ఇటీవల నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుసారెడ్డిపల్లిలో క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ మైదానం యువతకు ఎంతో ఉపయోగపడనున్నది.
అందమైన పల్లెకు పచ్చని హారంలా మారింది పల్లె ప్రకృతి వనం. పచ్చదనంపై గ్రామస్తులకు ఉన్న మక్కువతో రెండు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసుకున్నారు. బుసారెడ్డిపల్లి శివారులోని సింగూరు ప్రాజెక్టు అతి దగ్గరలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్నది. గ్రామ సర్పంచ్ మంతూరి స్వప్న శశికుమార్ ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రకృతి వనాన్ని దగ్గరుండి పనులు చేపడుతున్నారు. వివిధ రకాల 6,950 వేల మొక్కలు నాటించి వాటి సంరక్షణ చర్యలు తీసుకున్నారు. హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను రక్షించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో టేకు, తులసి, జామ, జీడీ, టైకోమా, నిమ్మ, ఖర్జూర, ఉసిరి తదితర మొక్కలు పెంచుతున్నారు.
గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా గ్రామస్తులందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సహాయంతో గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించుకుంటున్నాం.
– మంతురి స్వప్నాశశికుమార్, బుసారెడ్డిపల్లి, సర్పంచ్
సంగారెడ్డి జిల్లాలో కంది మండలంలోని ప్రముక ఐఐటీ (భారతీయ సంకేతిక విజ్ఞాన సంస్థ) పచ్చదనంతో పరిమలిస్తోంది. ఒక వైపు బహుళ అంతస్తులు, మరోవైపు పచ్చదనం, వికసించిన పువ్వులు అందాలతో అక్కడికి వచ్చేవారిని, విద్యార్థులను మంత్ర ముగ్దుల్ని చేస్తున్నది.
– సంగారెడ్డి ఫొటో గ్రాఫర్