ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా మారుతున్నాయి. ‘మన ఊరు-మన బడి’తో మౌలిక వసతులు సమకూరుతుండడంతో వాటి రూపురేఖలు మారుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మండలానికి 2 స్కూళ్ల చొప్పున 54 స్కూళ్లలో సకల సౌకర్యాలను కల్పించారు. జిల్లాలో 1338 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, తొలి విడుతలో 464 స్కూళ్లను ఎంపిక చేసి, అంచనాలను సైతం పూర్తి చేశారు.
ఇందులో 247 పాఠశాలల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంచనాలు పూర్తయిన స్కూళ్లలో 1712 పనులను చేపట్టేందుకు రూ.97.97 కోట్లు అవసరమని అధికారులు ప్రణాళికను రూపొందించారు. ఇప్పటి వరకు 398 స్కూళ్లకు పరిపాలన అనుమతులను సైతం జిల్లా విద్యాశాఖ మంజూరు చేసింది. మూడేండ్లలో జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు-మన బడి కింద అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చనున్నట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంటున్నది.
రంగారెడ్డి, జూలై 1 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి విడుతలో ఎంపికైన బడుల్లో 25 శాతం మేర పనులను పూర్తి చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టా రు.
ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో జిల్లావ్యాప్తంగా మండలానికి రెండు బడుల చొప్పున 54 పాఠ శాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యాయి. జూన్ నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు సంబంధిత పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు.
‘మన ఊరు- మన బడి’లో భాగంగా 12 అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనాలను రూపొందించారు. ఎంపికైన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ చాక్‌బోర్డులు, పెయింటింగ్, ప్రహరీలు, కిచెన్ షెడ్ల నిర్మాణం, శిథిలమైన తరగతి గదుల స్థానంలో నూతన గదుత నిర్మాణం, డిజిటల్ విద్య, డైనింగ్ హాళ్లను ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు శర వేగంగా జరుగుతున్నాయి. మండలానికి రెండు బడుల్లో చేపట్టిన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మొదటి విడుతలో ఎంపికైన బడుల్లోనూ మౌలిక వసతుల కల్పన పనులు జోరుగా జరుగుతున్నాయి. పనులను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నాం
– సుశీందర్ రావు, డీఈవో రంగారెడ్డి