సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : కర్ణాటక నుంచి రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా చెన్నూరుకు తరలిస్తున్న ముగ్గురిని సైబరాబాద్ ఎస్వోటీ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుల నుంచి దాదాపు రూ.80 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లాకు చెందిన సి.గంగారెడ్డి, పి.వెంకటేశ్వరరావు, పి.రమేశ్ స్నేహితులు. వీరంతా తాజాగా పత్తి విత్తనాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నాసిరకం విత్తనాలను సేకరించి వాటిని మంచిర్యాల జిల్లా చెన్నూరులో విక్రయించేందుకు పథకం వేశారు.
సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ, నందిగామ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నందిగామ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మేకగూడ వద్ద డీసీఎం వ్యాన్, ఓ కారును ఆపి తనిఖీ చేశారు. వాటిలో దాదాపు 54 బ్యాగుల నాసిరకం విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.80 లక్షల విలువ చేసే సొత్తును రికవరీ చేశారు. నకిలీ విత్తనాల ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులను సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్వోటీ అదనపు డీసీపీ నారాయణ, షాద్‌నగర్ ఏసీపీ కుశల్కర్, వ్యవసాయ అధికారి శ్వేత పాల్గొన్నారు.
కర్ణాటకు చెందిన గంగారెడ్డి ఆ రాష్ట్రంలో పత్తి నుంచి విత్తనాలను వేరు చేసి తిరిగి విత్తనాల నాణ్యత కోసం కంపెనీలకు పంపించేలా జిన్నింగ్ మిల్లును నిర్వహిస్తున్నాడు. మాక్సి ఈల్డ్ బయో జెనిటిక్స్ ప్రై.లిమిటెడ్ కంపెనీ విత్తనాల విక్రయాలు, వాటి పని తీరును కూడా పరిశీలిస్తాడు. మిల్లు ఉండడంతో ఏపీకి చెందిన వెంకటేశ్వరరావు రెండేండ్ల కిందట తన పొలంలో పండించిన పత్తిని గంగారెడ్డి జిన్నింగ్ మిల్లుకు పంపి ఒక టన్ను విత్తనాలను వేరు చేయించాడు. వాటికి రసాయనాల పాలిష్ చేయాలని కోరాడు.
కరోనా రావడంతో వాటిని తీసుకెళ్లలేదు. ఇటీవల వెంకటేశ్వరరావు గంగారెడ్డిని ఆ విత్తనాలతో పాటు ఇంకా రెండు టన్నుల విత్తనాలు కావాలని పురమాయించాడు. భారీ లాభాలు వస్తాయని ఆశచూపాడు. దీంతో గంగారెడ్డి తాను ఒప్పందం కుదుర్చుకున్న మ్యాక్సి ఈల్డ్ కంపెనీలోని కీలక ఉద్యోగి రమేశ్‌రెడ్డిని సంప్రదించి ఆఫర్ ఇచ్చాడు.
అతడు కంపెనీ రిజెక్ట్ చేసిన విత్తనాలను యాజమాన్యానికి తెలియకుండా వాటిని సేకరించి గంగారెడ్డికి 2 టన్నులు ఇచ్చాడు. మొత్తం 3 టన్నుల నకిలీ విత్తనాలను రైతులకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సరైన సమయంలో స్పందించడంతో దాదాపు 3 వేల ఎకరాల పత్తి పంట నష్టపోకుండా రైతులను కాపాడారు.