గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా ఎదుగడంతోపాటు పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే స్టార్ట్ ఆఫ్ విలేజ్ అంత్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్(ఎస్‌వీఈపీ)ను వికారాబాద్ జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా మిగితా 13 జిల్లాల్లోనూ విస్తరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
డీపీఆర్‌ను రూపొందించే పనిలో సెర్ప్ అధికారులు నిమగ్నమయ్యారు. కాగా జిల్లాలో ఈ కార్యక్రమం అమలుకు రుణాలను సక్ర మంగా చెల్లిస్తున్న వికారాబాద్, పరిగి బ్లాక్‌లను అధికారులు ఎంపిక చేశారు. వికారాబాద్ బ్లాక్ పరిధిలో వికారాబాద్, నవాబుపేట, మోమిన్‌పేట మండలాల్లోని 92 గ్రామాలు, పరిగి బ్లాక్ పరిధిలో పరిగి, దోమ, పూడూరు మండలాల్లోని 124 గ్రామాల్లోని మహిళలకు అవసరమైన రుణాలను ఇప్పించి వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహించనున్నారు.
ఈ కార్యక్రమ పర్యవేక్షణ కోసం ఎస్‌వీఈపీ ఏపీఎంను కూడా నియమించనున్నారు. మండల స్థాయిలో ఐకేపీ ఏపీఎం సమన్వయపర్చనున్నారు. వారు బ్లాక్ రిసోర్స్పర్సన్లను రిక్రూట్మెంట్ చేయనున్నారు. డీపీఆర్‌ను అధికారులు ఆమోదించిన తర్వాత జిల్లాలోని రెండు బ్లాక్ లలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నుంచి మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు.
పరిగి, జూన్ 21 : స్టార్ట్ అప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్(ఎస్‌వీఈపీ) వికారాబాద్ జిల్లాలో అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాలకు పరిమితమైన ఈ కార్యక్రమం మిగతా 13 జిల్లాలకు విస్తరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఈమేరకు వికారాబాద్ జిల్లాలోనూ డీపీఆర్‌లు తయారు చేసి పంపించాలని సెర్ప్ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎస్‌వీఈపీ కింద ఔత్సాహిక మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారేందుకు అవసరమైన రుణాన్ని ఇప్పించనున్నారు. దీంతో రాబోయే కొద్ది సంవత్సరాల్లో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన ప్రోత్సాహం అందనుంది. ఈ పథకాన్ని 2016 నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్నది.
కొత్తగా అమలు చేయబోయే ఎస్‌వీఈపీ కార్యక్రమానికి జిల్లా పరిధిలోని వికారాబాద్, పరిగి బ్లాక్‌లను ఎంపిక చేశారు. వికారాబాద్ బ్లాక్ పరిధిలో వికారాబాద్, నవాబుపేట, మోమిన్‌పేట మండలాలున్నాయి. ఈ మూడు మండలాల పరిధిలో గల 81 గ్రామపంచాయతీల పరిధిలోని 92 గ్రామాల్లో 1,74,040 జనాభా ఉన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీల జనాభా 51,454 మందికి.. మహిళలు 86,600 మంది ఉన్నారు.
ఈ బ్లాక్ పరిధిలో అక్షరాస్యత శాతం 57.40 ఉన్నది. వికారాబాద్ బ్లాక్‌లో 2407 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సభ్యులు 25,057 మంది ఉన్నారు. బ్లాక్ పరిధిలో బ్యాంకు రుణాల రికవరీ 97శాతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
జిల్లాలోని పరిగి బ్లాక్ పరిధిలో పరిగి, దోమ, పూడూరు మండలాలున్నాయి. పరిగి బ్లాక్ పరిధిలో 103 గ్రామపంచాయతీల పరిధిలోని 124 గ్రామాలు ఎస్వీఈపీకి ఎంపికయ్యాయి.
వాటిలో జనాభా 1,56,092 మందికి.. ఎస్సీ, ఎస్టీల జనాభా 44800, మహిళలు 77792 మంది ఉన్నారు. ఈ బ్లాక్ పరిధిలోని అక్షరాస్యత 52.61 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బ్లాక్‌లో 2742 ఎస్‌హెచ్‌జీలు ఉండగా 28921 మంది సభ్యులు ఉన్నారు. పరిగి బ్లాక్ పరిధిలో రుణాల రికవరీ 95 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా పరిధిలో తక్కువ ఎన్పీఏ ఉన్నటువంటి మండలాల్లో ఈ పథకం అమలుకు అధికారులు నిర్ణయించారు. ఈ పథకం అమలుకు బ్లాక్‌కు ఒక ఎస్‌వీఈపీ ఏపీఎంను నియమించనున్నారు.
మండల స్థాయిలో ఐకేపీ ఏపీఎం సమన్వయపరచనున్నారు. ప్రత్యేకంగా బ్లాక్ రిసోర్స్ పర్సన్ల నియామకాన్ని కూడా చేపట్టనున్నారు. డీపీఆర్‌ను ఆమోదించిన తర్వాత జిల్లా పరిధిలోని రెండు బ్లాక్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కోసం కనీసం రెండు నుంచి మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు.
మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సాహించాలనే చక్కటి సంకల్పంతో ఎస్‌వీఈపీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకం ద్వారా కనీసం రూ.1.50లక్షలతో వ్యాపారం చేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసినవారిలో 70శాతం మంది కొత్తవారై ఉండాలి. మిగతా 30శాతం మంది ఇప్పటికే ఉన్న వివిధ రంగాలకు చెందినవారు తమ వ్యాపారాలు విస్తరించుకోవడానికి అనుమతించనున్నారు.
ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నవారు అదనంగా సంవత్సరానికి కనీసం రూ.60వేలు ఆదాయాన్ని సంపాదించాల్సి ఉంటుంది. నెలకు కనీసం రూ.5వేలు అదనపు ఆదాయాన్ని సంపాదించాలి. ఈ కార్యక్రమం కింద ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వ్యాపారపరంగా అవసరమైన సూచనలు, సలహాలు అందించడంతోపాటు వారికి ప్రోత్సాహకంగా నిలువడం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.
వికారాబాద్ జిల్లాలోఎస్వీఈపీ పథకం అమలునకు సంబంధించి జిల్లాలో వికారాబాద్, పరిగి రెండు బ్లాక్‌లను ఎంపిక చేశారు. ఒక్కో బ్లాక్‌లో మూడు మండలాల చొప్పున ఆరు మండలాల్లో ఎస్‌వీఈపీ అమలుకు నిర్ణయించారు. తక్కువ ఎన్పీఏ ఉన్న మండలాలను ఎంపిక చేయగా, పథకం అమలుకు సంబంధించిన డీపీఆర్‌లు తయారు చేయనున్నారు. జీవనోపాధి మెరుగుపరచడంతోపాటు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సాహం అందనుంది.
– కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా