రంగారెడ్డి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి కలెక్టర్రేట్ సోమవారం ధర్నాలతో దద్దరిల్లింది. ప్రభుత్వ విధానాలపై ప్రజాసంఘాల నేతలు ఆక్రోశాన్ని వెళ్ల గక్కారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చినమాట నిలబెట్టుకోకపోవడంతో నిరసన జ్వాల ఎగిసిపడింది. పెండింగ్ వేతనాలను చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు భారీగా తరలివచ్చి నిరసన గళమెత్తారు. మరోవైపు విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వీరు పది రోజులుగా ధర్నాను కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ కవిత, సీఐటీయూ జిల్లా నాయకులు కృష్ణ, ఏర్పుల నర్సింహ తదితరులు మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం, గుడ్ల బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. అనంతరం పది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. జిల్లా సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం నాయకులు అబ్దుల్ అజీజ్, సంపత్, గిరీశ్ మాట్లాడుతూ జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిన విద్యాశాఖలోని సమగ్ర శిక్షా అభియాన్లో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షల జీవిత బీమా, రూ.10 లక్షల ఆరోగ్యబీమా చేయించాలని కోరారు. ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు బెన్ఫిట్స్ కింద రూ.25 లక్షలు ఇవ్వాలని కోరారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.
Rr2