యాచారం, సెప్టెంబర్ 14 : ‘విధుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాలి… రోగులకు మెరుగైన వైద్యం అందించండి..’ అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆర్డీవోతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యం ఎలా అందుతున్నది.. మందులు సరిగా ఇస్తున్నారా.. అంటూ రోగులను ఆరా తీశారు. దవాఖానలోని ఎక్స్రే ఆపరేటింగ్ గది, మరుగుదొడ్లు, రోగులకు ఏర్పాటు చేసిన పడకలు, శిథిలావస్థలో ఉన్న దవాఖాన భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నూతన దవాఖాన భవన నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ప్రస్తుతం ఈ దవాఖానలో నలుగురు ఎంబీబీఎస్ డాక్టర్లు, ఇద్దరు స్పెషలిస్టులు, 11మంది స్టాఫ్ నర్సులు, 11 మంది సిబ్బంది ఉన్నారని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. దవాఖానలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఇక్కడే చేయాలని, రోగులను ఇబ్బందులకు గురి చేయవద్దని హెచ్చరించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులతో దురుసుగా వ్యవహరించవద్దన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.