రంగారెడ్డి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : ప్లాట్ల క్రమబద్ధీకరణను పారదర్శకంగా చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. యూఎల్బీలలోఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల ప్రాసెసింగ్‌పై ఖమ్మం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర సచివాలయం నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, భూపరిపాలన ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రంగారెడ్డి జిల్లా నుంచి కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, భూపాల్‌రెడ్డిలు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరం నుంచి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉత్తర్వులలో పేరొన్న విధంగా క్రమబద్ధీకరణ చార్జీల చెల్లింపులు.. అనధికారిక ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన విధానంపై మున్సిపల్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడంగ్‌పేట, తురయాంజాల్, పెద్దంబర్‌పేట్, షాద్‌నగర్‌లలో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు ఎకువగా ఉన్నాయన్నారు.
ఎల్ఆర్ఎస్లో ప్లాట్ క్రమబద్ధీకరణకు మూడు స్థాయిల్లో పరిశీలించాలన్నారు. డీపీవో, మున్సిపల్ కమిషనర్లు జీవో నం.131ని క్లుప్తంగా అవగాహన చేసుకుని ముందుకు పోవాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీపీవో సురేశ్ మోహన్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వికారాబాద్ కలెక్టరేట్లో..
వికారాబాద్ : సరళీకృత చెల్లింపు పథకం (ఎల్ఆర్ఎస్) ద్వారా భూములు క్రమబద్ధీకరణకు అధికారులు చర్యలు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపల్, గ్రామపంచాయతీ పరిధిలోని అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టాలన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో 20968, గ్రామపంచాయతీల పరిధిలో 12745 క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను మూడు దశల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా కమిటీలను రూపొందించాలన్నారు. భూముల క్రమబద్ధీకణపై జిల్లా, మండల, మున్సిపాలిటీ పరిధిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి, డీపీవో జయసుధ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.