రంగారెడ్డి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. వర్షాలు కురుస్తున్నందు ఏ విధమైన ఆకస్మిక విపత్తు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు, వరద ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్లకుండా తగు నిఘా పెట్టాలన్నారు. ముఖ్యంగా ఉధృతంగా పారే వాగుల వద్ద ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు, మ్యాన్ హోళ్లను తెరవకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
వర్షాలు, వరదల వల్ల తీసుకునే జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రసారమాధ్యమాల ద్వారా చైతన్య పరచాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ట్యాంకులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగు మందులను సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. వరదలు, వర్షాల వల్ల కొన్ని చోట్ల చెరువులకు స్థానికులు గండ్లు పెట్టే అవకాశం ఉన్నదని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయన్నారు.
పోలీస్, నీటి పారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖలతో కలిసి సమన్వయంతో పని చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో రెవెన్యూ, మున్సిపల్, జిల్లా పరిషత్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్తు, రోడ్డు భవనాల శాఖ, మిషన్ భగీరథ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.