రంగారెడ్డి, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ అన్ని రంగాల్లో ప్రగతి వెలుగులు దశదిశలా విరజిమ్ముతున్నాయని కలెక్టర్ శశాంక అన్నారు. ఆదివారం రంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ శశాంక ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంతో రంగారెడ్డి జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉందని, జిల్లాకు చెందిన అనేకమంది ఉద్యమకారులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. అమరుల కుటుంబాలు, ఉద్యమకారులకు, స్వ రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ వందనాలు తెలియజేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ స్ఫూర్తితో జిల్లా ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ.. సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నామన్నామని కలెక్టర్ అన్నారు. పరిపాలనలో పారదర్శకతతోపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే వాతావరణాన్ని ప్రభుత్వం నెలకొల్పుతున్నదని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 5కోట్ల63 లక్షల మంది మహిళలు ఫ్రీ బస్సు సదుపాయాన్ని వినియోగించుకున్నారన్నారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా జిల్లాలో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 2,726 మంది ఆరోగ్యశ్రీ వైద్యసేవలు పొందారని..అందుకు రూ. 90,80, 450 ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అయుష్మాన్ భారత్ పథకం కింద 4,29, 722 మంది లబ్ధిదారులకు హెల్త్‌కార్డులు అందించామన్నారు. జిల్లాలో యాసంగి 2023-2024 సీజన్‌కు పెట్టుబడి సహాయంగా ఇప్పటివరకు 3,25,216 మంది రైతుల ఖాతాల్లో రూ.343 కోట్ల 10 లక్షల నిధులను జమ చేశామని.. పాఠశాలల ప్రారంభానికి ముందే బడిబాట కార్యక్రమ నిర్వహణకు జిల్లా యంత్రాంగం ప్రణాళికను తయారు చేసిందని.. ప్రభుత్వ బడుల్లో హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసు కుంటున్నామన్నారు. విద్యార్థుల యూనిఫామ్‌ను మహిళా సంఘాల సభ్యులతో కు ట్టించి వారికి ఆర్థిక చేయూతను అందిస్తున్నామన్నారు.
జిల్లాలో 2023-24 విద్యాసంవత్సరంలో టెన్త్ పరీక్షలకు 50,948 మంది విద్యార్ధులు హాజరుకాగా.. అందులో 46,245 మంది ఉత్తీర్ణులైనట్లు కలెక్టర్ తెలిపారు. ఉత్తీర్ణతాశాతం 90.77 నమోదు కాగా 1,371 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధిం చారన్నారు. ఇందులో బాలుర 88.89శాతం, బాలికల ఉత్తీర్ణత 93.32శాతంగా ఉందన్నారు. టెన్త్‌లో 36 ప్రభుత్వ బడులు వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించా యన్నారు.
అదేవిధంగా ఇంటర్ ప్రథమ ఏడాది ఫలితాల్లో 71.1శాతంతో జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో.. ద్వితీయ ఏడాది ఫలితాల్లో 77.63శాతంతో రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలోని యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టాటా టెక్నాలజీస్ కంపెనీ భాగస్వామ్యంతో వర్షాప్స్ నెలకొల్పి, అడ్వాన్స్డ్ సిల్ సెంటర్‌ను షాద్ నగర్లో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుకు అవసరమైన కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు చేపట్టిన చర్యలు ఫలితాలు ఇచ్చాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా మహిళలు, యువతకు మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు .. స్వీప్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. 2019 ఎన్నికలతో పోలిస్తే..ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ 3.21శాతం పెరిగిందన్నారు. ఓటింగ్ శాతం పెంపునకు కృషిచేయడంతోపాటు, ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించిన అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 4న జరుగనున్న కౌంటింగ్‌ను అందరి సహకారంతో పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. వేడుకల్లో రాచకొండ డీసీపీ అరవింద్‌కుమార్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఆమనగల్లు కేజీవీబీ విద్యార్థినులు, జడ్పీహెచ్ ఎస్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి మెమెంటోలను అందజేశారు.
అయితే తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు తెలిపేలా తలకొండపల్లి, మాడ్గుల ప్రాంతాల నుంచి విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆలస్యంగా రావడంతో వారికి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. వేడుకల్లో రెండు, మూడు ప్రదర్శనలనే నిర్వహించడం..మధ్యలో మైక్ మొరాయించడం వంటి సంఘటనలు వల్ల ఈసారి వేడుకల్లో ఒకప్పటి కళ తప్పిందన్న అభిప్రాయం సర్వత్రా వినిపించింది.
వికారాబాద్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముందుగా పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ దగ్గర ఉన్న అమరవీరుల స్థూపానికి ఎస్పీ కోటిరెడ్డితో కలిసి పూల మాలలువేసి నివాళులర్పించారు. కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
Vikarabad Collector Narayan
ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్ర పోరాటంలో అమరుల త్యాగాలు మరువలేవని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తై 11వ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో ఉ త్సాహంగా వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమరుల ఆశయాలు, ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని, జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన చేవెళ్ల లోక్‌సభ పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సహ కరిం చిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర పదేండ్ల వేడుకను పురస్క రించుకుని తాండూరు బాలికల ఉన్నత పాఠశాల, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలికల పాఠశాల మోమిన్‌పేట, సరస్వతినిత్య కళాశాల వికారాబాద్, బాల కేంద్రం విద్యార్థులు, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం కళాకారులచే నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, జడ్పీచైర్ పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ మంజులారమేశ్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.