రంగారెడ్డి, జూన్ 14(నమస్తే తెలంగాణ)/వికారాబాద్ : వారం వ్యవధిలో ‘ధరణి’ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణిలో భూసంబంధిత అంశాలపై దరఖాస్తుదారులు సమర్పించిన అర్జీలపై చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాల పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో రాష్ట్ర భూపరిపాలనా విభాగం ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్లు అధికారులతో సమీక్షించి మాట్లాడారు. ధరణిలో వివిధ మాడ్యూల్స్ కింద దాఖలైన దరఖాస్తులను పరిశీలించి యుద్ధప్రాతిపదికన పరిషరించాలని ఆదేశించారు. ఆయా దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తయిన వాటిని మూడు,
నాలుగు రోజుల్లో పరిషరించాలని, ఏ ఒక దరఖాస్తు కూడా పెండింగ్‌లో లేకుండా వారం వ్యవధిలో పరిషరించాలన్నారు. అపరిష్కృతంగా ఉన్న ధరణి దరఖాస్తుల సత్వర పరిషారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్డీవోలు, తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజా సమస్యల సత్వర పరిషారం కోసం ప్రజా భవన్లో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన అర్జీలను కూడా వెంటనే పరిషరించాలని ఆదేశించారు. అర్జీలపై చేపట్టిన చర్యల గురించి దరఖాస్తుదారుడికి వివరాలు తెలియజేయడంతోపాటు, వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆర్డీవోలు సాయిరాం, అనంత్‌రెడ్డి, సూరజ్ కుమార్, వెంకట్‌రెడ్డి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.