రంగారెడ్డి, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఏర్పాటవుతున్న భారత్ ఫ్యూచర్‌సిటీ దేశానికే తలమానికం కానున్నదని.. దేశంలోనే ఇది మొట్టమొదటి నెట్‌జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్‌సిటీ అని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆయన కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించి.. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించా రు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అనం తరం ఆయన జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. అద్భుత వారసత్వ సంపద, సుస్థిరమైన పట్టణాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణల కు ఒక నమూనాగా ఫ్యూచర్‌సిటీ రూపుదిద్దుకుంటున్నదన్నారు. ఏఐసిటీ, స్పోర్ట్స్‌సిటీ, ఫార్మాసిటీ, లైఫ్ సైనెన్స్ హెల్త్‌సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు. ఫ్యూచర్‌సిటీలో అంతర్జాతీయస్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉండాలని ప్రత్యేక కమిషనరేట్‌ను స ర్కార్ ఏర్పాటు చేసిందన్నారు.
అలాగే, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి జిల్లాను కలుపుతూ పలు రేడియల్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్యూచర్‌సిటీ కోసం ఔట ర్ రింగ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజినల్రింగ్రోడ్డు ఆకుతోటపల్లి వరకు రూ.నాలుగు వేల కోట్ల అంచనా వ్య యంతో 41 కిలోమీటర్ల పొడవు రేడియల్ రోడ్డును నిర్మిస్తున్నామని.. ఈ రోడ్డు హైదరాబాద్ మహానగరంతోపాటు ఫ్యూచర్‌సిటీ మధ్య ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేస్తుందన్నారు. బుద్వేల్ నుంచి నాచారం మధ్య గల షాబాద్, కొందుర్గు, చౌదరిగూడం వంటి పలు మండలాలను కలుపుతూ మరో రేడియల్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్రఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పడం కోసం, అలాగే, రాష్ర్టానికి భారీ పెట్టుబడులను ఆకర్శించడమే లక్ష్యంగా ఫ్యూచర్‌సిటీ లో ప్రభుత్వం ఇటీవల గ్లోబల్ సమ్మిట్‌ను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. అలాగే, జిల్లాలోని మూసీనది ప్రక్షాళనకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ఏర్పాటుచేసి రెండు దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం
నిర్ణయించిందన్నారు. జిల్లాలో పేదరిక నిర్మూలనతోపాటు ప్రజలకు కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటి అనేక వినూత్న కార్యక్రమాలను తీసుకొచ్చినట్లు వివరించారు. జిల్లాలో ఇందిరమ్మ మొదటి విడతలో 15,500 మంది లబ్ధిదారులకు రూ.253 కోట్లను సర్కార్ కేటాయించిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 51,874 కొత్త రేషన్‌కార్డులను అందజేసినట్లు చెప్పారు. గృహజ్యోతి, మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ రైతు భరోసా, రైతు బీమా వంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మత్స్యకారులకు ఉచిత చేపపిల్లల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ పేదలకు ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు.
గత వానకాలం సీజన్లో జిల్లాలో 2,879 మంది రైతుల నుంచి 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అలాగే, జిల్లాలో ఆయిల్పామ్సాగు, ఉద్యాన పట్టు పరిశ్రమ, రైతులకు 2లక్షల రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జిల్లాలో విద్యారంగం కూడా ఎంతో ప్రగతి సాధించిందన్నారు. జిల్లాలో 1,38,900 మంది విద్యార్థులకు రూ.9.73 కోట్ల ఖర్చుతో ఉచితంగా యూనిఫాంలు, 5.95 కోట్లతో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే, జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.23.30 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.
కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకర్షించాయి. డీపీఎస్ నాదర్గుల్, ఎన్జేపీ పాలమాకుల, మహేశ్వరం బాష్యం, జడ్పీఎచ్ఎస్ సాహెబ్‌నగర్, జడ్పీఎస్ఎస్ తుక్కుగూడ, పాఠశాలలు ప్రదర్శించిన దేశభక్తి, జానపద నృత్యాలు, ఆపరేషన్ సిందూర్, బంజారా నృత్యం వంటివి ఎంతగానో ఆకర్షించాయి.
పలువురికి జిల్లా కలెక్టర్ రుణాలను పంపిణీ చేశారు. దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, చెవి మిషన్లు అందజేశారు. చేనేత రుణమాఫీ కింద రూ.82.51లక్షల చెక్కును అందజేశారు. జ్యోతి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.991 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, శంషాబాద్ డీసీపీ రాజేశ్, పలువురు ఐపీఎస్ అధికారులు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, సిబ్బంది ఆయా పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లాకు సంబంధించిన గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్యుత్‌శాఖ, వైద్యారోగ్య, హౌసింగ్, అగ్నిమాపక, సివిల్ సప్లయ్ శాఖలు శకటాలను ప్రదర్శించారు.
రంగారెడ్డిజిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో 77వ గణతంత్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నారాయణరెడ్డి హాజరై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి ఆయన వివరించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, విద్య, వైద్యం, హౌసింగ్, సివిల్ సప్లయ్ శాఖలకు సంబంధించిన శకటాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.