రంగారెడ్డి : పార్టీ ద్విదశాబ్ది వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరికి ముఖ్య నాయకులు, ఆహ్వానిథులు అందరూ తరలిరావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హైటెక్స్‌లో జరుగనున్న ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, పార్టీ 20 వసంతాల వేడుకను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ అధ్యక్షురాలైన మంత్రి సబితారెడ్డి తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ముఖ్య నేతలకు, ప్రజాప్రతినిధులకు పాసులు జారీ చేసినట్లు, నేతలంతా సమయానికి చేరుకుని ప్లీనరీలో పాల్గొనాలని మంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ధ్యేయంగా పార్టీ స్థాపించి, నాలుగు కోట్ల మంది ప్రజల కలను నెరవేర్చి నేడు ముఖ్యమంత్రిగా సమర్థవంత పాలనను అందిస్తూ దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిల్పటంలో కేసీఆర్ పాత్ర ఎంతో గొప్పదన్నారు.
తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా టీఆర్ఎస్ నిలుస్తుందని, ప్రజల ఆశీర్వాదాలతో మరో 20ఏండ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని మంత్రి పేర్కొన్నారు. ప్లీనరీతో పాటు వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే విజయగర్జనలను విజయవంతం కోసం ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి దిశనిర్దేశం చేశామన్నారు. ప్లీనరీకి విచ్చేస్తున్న సీఎం కేసీఆర్‌కు జిల్లా తరుపున ఘన స్వాగతం పలుకుతున్నామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్లీనరీకి తరలివస్తున్న ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్లీనరీ, విజయగర్జన సభలను విజయవంతం చేయాలని కోరారు.